న్యాయానికి అంకితమైన జీవితం… మహాయోధుడి గౌరవం
జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం
నిబద్ధత గలవారికి రావి నారాయణరెడ్డి పురస్కారం నిజమైన గౌరవం
మా ప్రభుత్వం ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తోంది
అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
అన్నింటిలోకెల్లా ఇదెంతో ప్రత్యేకమైన అవార్డు
వందల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఆదర్శమూర్తి : జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):రావి నారాయణరెడ్డి స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రావి నారాయణరెడ్డి పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి సీఎం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిజాం పాలకులకు వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి పోరాటం చేశారని, నాడు ప్రజల కష్టాలు, రాచరిక పోకడలు, అరాచక చర్యలపై పోరాడారని గుర్తుచేశారు. 500 ఎకరాల భూమిని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారన్నారు. స్వేచ్ఛను హరించి, హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు వస్తుందని, ప్రజల తిరుగుబాటు సాయుధ పోరాటంగా మారుతుందని ఆయన చాటి చెప్పినట్టు వివరించారు. 60 ఏళ్లు వచ్చేసరికి రాజకీయ పదవీ విరమణ చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణరెడ్డి అని కితాబిచ్చారు. ప్రజల నుంచి తిరస్కారం పొందినా నేటి నేతలకు పదవీ వ్యామోహం పోవడం లేదని అన్నారు. ప్రజల్లో చైతన్యం నింపిన వారే గొప్ప నాయకులు అవుతారని, రావి నారాయణరెడ్డికి సముచిత గౌరవం ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, నారాయణ , పల్లా వెంకట రెడ్డి , అజీజ్ బాషా, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, అమర వీరుల స్మారక ట్రస్టు కార్యదర్శి కంది మల్ల ప్రతాప్ రెడ్డి, సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ హాజరయ్యారు.
తప్ప్పుచేస్తే విచారణ జరపొద్దా..?
అక్రమ మార్గాలను ఎంచుకున్నప్ప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదు
అధికార దుర్వినియోగంతో వందల ఎకరాలు, వేల కోట్లు సంపాదించారు
హూందాగా తప్ప్పుకుంటే కొంతైనా గౌరవం నిలబడేది
మాజీ సీఎం కేసీఆర్, బీఆరఎస్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు
ఈ తరానికి జైపాల్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటివారు స్ఫూర్తి
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవించిందని రేవంత్ రెడ్డి వివర్శించారు. వందల ఎకరాల ఫాంహౌస్‌లు, వేల కోట్ల వ్యాపారాలు మీకే వచ్చాయని, బీఆరఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని దుయ్యబడ్డారు. మీరు జాతిపిత ఎలా అవుతారు? ఉద్యమకారులు ఎలా అవుతారు? అని నిలదీశారు. రావినారాయణ రెడ్డి స్మారక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమమార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా విచారణ తప్పదని స్పష్టం చేశారు. ప్రజలు తిరస్కరించినపుడు నాయకులు అర్థం చేసుకోవాలని, బీఆరఎస్ నేతలు ప్రజల తిరస్కారానికి గురయ్యారని హితువు పలికారు. ప్రజలే తప్పు చేశారని చెబితే ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు గుర్తించి ప్రజాక్షేత్రం నుంచి తప్పుకుంటే గౌరవం నిలబడుతుందని, నేరాలు చేస్తాం. ప్రశ్నించవద్దని మీరెలా అంటారని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం చేసి వేల కోట్లు, వందల ఎకరాలు సంపాదించారని ఆరోపించారు. నేరాలను విచారించవద్దని ఎక్కడా లేదని, గతంలో శిబూసోరెన్ విచారణ ఎదుర్కోలేదా? లాలూ, జయలలిత, యడియూరప్ప విచారణ ఎదుర్కోలేదా? ప్రశ్నించారు.
నాడు గాంధీ ప్రాణ త్యాగం చేయలేదా?
పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారని, ఆనాడు గాంధీజీ పదవులు త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారని, తెలంగాణ ఉద్యమం నడిపించిన ప్రొ.కోదండరామ్ ఉద్యమకారుడు కాదా? ప్రశ్నించారు. “తలుపులు బద్ధలు కొట్టి కోదండరామ్‌ను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా?, అప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా?” అని నిలదీశారు. నోటీసులు ఇచ్చి కేసీఆర్‌ను విచారణకు పిలిచారని, రావి నారాయణరెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని, పదవులు, వేల కోట్లు సంపాదించిన మీరు ఉద్యమకారులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలని హితువు పలికారు. హుందాగా తప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేదని అన్నారు. ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణమని నిలదీశారు. అక్రమమార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించారు.


