పంచాయితీల్లో సత్తా చాటుతాం: డిసిసి

కరీంనగర్‌,జూన్‌6(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌ జిల్లాలో సత్తా చాటుతుందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో పార్టీ పరంగా ఎన్నికలు నిర్వహిస్తే సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 33 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే, తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పదివేల ఎకరాలను మాత్రమే పంపిణీ చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హవిూలను పూర్తిగా నెరవేర్చకుండా, మాయమాటలతో కాలయాపన చేస్తుందన్నారు. తెరాస నాయకులు మైకు దొరికితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నామ జపం చేయడం తప్ప ఈ నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి చేసేందేవిూ లేదని దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గమనించి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సర్పంచులను ఏకగ్రీవంగా గెలిపించాలని కోరారు.తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అన్నారు.