పండుగ వాతావరణంలో చెక్కుల పంపిణీ

జగిత్యాల,మే9(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 10 నుంచి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని, రైతులకు పెట్టుబడి సాయం అందించడం దేశంలోనే మొదటి సారి అని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అన్నారు. 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ప్రారంభమవుతున్న చెక్కులు, పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీని ఓ పండుగలా నిర్వహించబోతున్నామని అన్నారు. సిఎం కెసిఆర్‌ ఉమ్మడి జిల్లాలో పథకం ప్రారంభించడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ రైతులకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారిని వ్యవసాయంలో రాజు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రైతులకు చేదోడువాదోడుగా ఉండేలా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. అనుకున్న విధంగా పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. అన్ని మండలాల్లో ఈ పంపిణీని ఒకేసారి ప్రారంభిస్తామన్నారు. గత పాలకులు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా తుంగలో తొక్కాయని, రైతుల సంక్షేమానికి నాటి ప్రభుత్వాలు తూట్లు పొడిచాయని ఎద్దేవా చేశారు.  రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబందు పథకాన్ని ప్రవేశపేట్టినట్లు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబందు పథకం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించడం తమకు గర్వకారణమని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హవిూలే కాకుండా రైతుల సంక్షేమం కో సం నిరంతరం శ్రమించే నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు.
——