పండ్లను రసాయానాలతో మాగ బెట్టడం ఉగ్రవాదం కంటే ప్రమాదం

C

– సహజంగానే పండే వాటికి కార్బైడ్‌ ఎందుకు?

– ప్రభుత్వాల నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్‌

హైదరాబా,ఆగస్ట్‌19(జనంసాక్షి):

పండ్లను మగ్గబెట్టడానికి కార్బైడ్‌ వాడకాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  కార్బైడ్‌ వాడకాన్ని ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. కాయలను పండ్లుగా మార్చేందుకు వ్యాపారులు కాల్షియం కార్బైడ్‌ వాడటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రమాదకర నిషేధిత కార్బైడ్‌ రసాయన పదార్ధం వాడడం వల్ల ప్రజారోగ్యంపై దుష్ప్రభావం ఉంటుందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రమాదకరమైనదని తెలిసి కూడా దానిని ఎందుకు నిరోధించలేకపోతున్నారని కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. సహజసిద్ధంగా మగ్గాల్సిన పండ్లను రసాయనాలు ఉపయోగించి ప్రజల ఆరోగ్యాలను క్షీణింపచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు నిషేధిత కార్బైడ్‌ను ఎలా తీసుకొస్తున్నారని ప్రశ్నించింది. పత్రికా కథనాన్ని సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం కార్బైడ్‌ వాడకుండా సహజసిద్ధంగా పండ్లను మగ్గించలేరా అని ప్రశ్నించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు పండ్ల మార్కెట్లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక జీపీ సంజయ్‌కుమార్‌ న్యాయస్థానానికి తెలియజేశారు. పెద్దమొత్తంలో కార్బైడ్‌ను ఉపయోగించి కాయలను పండ్లుగా మార్చుతున్నట్లు గుర్తించడంతో పాటు అధిక మొత్తంలో కార్బైడ్‌ నిల్వలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పండ్ల నమూనాల పరీక్షల ఫలితాలు కూడా ప్రయోగశాల నుంచి వచ్చినట్లు కోర్టుకు తెలిపారు. వ్యాపారుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది కూడా కార్బైడ్‌ వాడుతున్నట్లు కోర్టుకు తెలియజేశారు. అయితే ప్రత్యామ్నాయం లేకనే వాడాల్సి వస్తోందని పేర్కొనగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ పలుచోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించి పండ్ల నమూనాలను సేకరించారని.. పరీక్షల నిమిత్తం నాచారంలోని ప్రయోగశాలకు పంపినట్లు ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీనిపై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం… సమగ్ర వివరాలతో కూడిన ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది.