పత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విప్లవోద్యమం
(శుక్రవారం తరువాయి భాగం)
అట్లాగే భూస్వామికైనా, రైతుకైనా గ్రామంలోని భూమి మీద కాకుండా, పట్టణంలో మరొక ఆదాయం ఉండడానికి అనుమతించమని చెప్పింది. ఇదంతా గ్రామల్లో విప్లవ నిర్మాణాలకు అవరోధం కాని మేరకు భూసంస్కరణల అమలుగా ప్రతిపాదించింది. తెలంగాణ అంతటా రైతాంగం స్వాధీనం చేసుకున్న భూముల్లో ఎర్రజెంఆలు రెపరెపలాడాయి. 1992 నాటికే విప్లవోద్యమం ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది. భారతదేశంలో ఇతర విప్లవ పార్టీలతో ముఖ్యంగా సిపిఐ, ఎంసిసిఐలతో ఐక్యతా ప్రయత్నాలు కొనసాగించింది.
ఈ కాలానికే 1991లో నూతన ఆర్థిక విధానం పేరుతో కేంద్రంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాన్ని పివి నరసింహారావు ప్రవేశపెట్టాడు. 1992లో బాబ్రీమసీదు విధ్వంసం జరిగింది. 1992లో ఆంధ్రప్రదేశ్‌లో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా దింపి, రాజీవ్‌గాంధీ అనుచరుడైన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి హైదరాబబాద్ పాతబస్తీలో రాయలసీమ నుంచి వైఎస్సార్ ముఠా బాంబులు, కత్తులతో దాడిచేసి వందలాది ముస్లీంలను చంపేసింది.జనార్థన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలను ప్రైవేటికరించడానికి ప్రయత్నించాడు. పీపుల్స్ వార్‌ను, విప్లవ ప్రజా సంఘాలను నిషేదించడు. ఇతని కాలంలోనే గులాం రసూల్ వంటి జర్నలిస్టును ఎన్‌కౌంటర్ పేరుతో చంపివేశారు. ఎపిసిఎల్‌సి నాయకుడు నర్రా ప్రభాకర్‌రెడ్డిని చంపేశారు. పీపుల్స్ వార్ కార్యదర్శి పులి అంజయ్య, ఆయన సహచరి భాగ్యలను చంపేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంత నిర్బంధాన్ని చవిచూస్తున్నప్పటికీ దండకారుణ్యంలో ముఖ్యంగా బస్తర్‌లో, ఉత్తర తెలంగాణలో గ్రామ రాజ్య కమిటీల నాయకత్వంలో అభివృద్ది కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాథమిక అవసరమైన భూమితోపాటు తాగు, సాగు నీరు, ప్రాధమిక విద్య, ప్రాధమిక ఆరోగ్యం, ఎరువులు, విత్తనాలు, ఈ కమిటీల నాయకత్వంలో ప్రజలకు అందించాలని, ఇందులో ప్రజలను సహకార స్థాయిలో స్వచ్చంద సేవతో పెద్ద సంఖ్యలో ప్రవేశపెట్టాలని, వందలాది గ్రామాల్లో కృషి చేసింది. ఎన్నికలు బహిష్కరించి, ప్రభుత్వానికి వన్నులు కట్టడాన్ని నిరాకరించిం, గ్రామ రాజ్య కమిటీల నాయకత్వంలో ఈ స్వావలంబన అభివృద్ది నమూనాను అమలు చేయడానికి పూనుకున్నది. ఆరంభంలో ఉత్తర తెలంగాణలో వందలాది గ్రామాలలో దక్షిణ తెలంగాణలో నల్లగొండ జిల్లావంటి చోట ఈ ప్రయోగం జరిగింది. బస్తర్‌లోనైతే ఈ ప్రయోగం ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి జనతన సర్కార్‌గానూ, క్రాంతికార్ జనతన సర్కార్‌గానూ ఒక ప్రత్యామ్నాయ ప్రజా ప్రభుత్వమే అక్కడ నడుస్తున్నది.
ఇదే కాలంలో ప్రపంచ బ్యాంక్ కుట్రతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 1995 ఆగస్ట్ మొదలుకొని తొమ్మిదిన్నర సంత్సరాల పాటు అమలు చేసిన నిర్బందం, రక్తపాతాల వల్ల ఉత్తర తెలంగాణలో ఈ నిర్మాణాలు దెబ్బతాన్నాయి. ఈ కాలంలోనే సింగరేణి కార్మిక సమాఖ్య తర్వాత అంత శక్తివంతంగా హైదరాబాద్ నగరంలోనూ, మెదక్ జిల్లాలోనూ నిర్మాణమైన విప్లవ కార్మిక సంఘాల మీద ప్రభుత్వం తీవ్రమైన నిర్బందాన్ని అమలు చేసి ఆ సంఘాలు నిర్మాణం చేసిన విప్లవ కార్యకర్తలందరిని పట్టుకుని ఎన్‌కౌంటర్ పేరుతో చంపివేసింది. హైదరాబాద్‌లోనూ, హైదరాబాద్ పరిసర జిల్లాలోనూ ఉన్న పబ్లిక్ రంగ పరిశ్రమలను మూసి వేయడానికి, రద్దు చేయడానికి ఈ మొత్తం పరిశ్రమలను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం గానీ, లేదా, రియల్ ఎస్టేట్‌గా అమ్మడం కోసం గానీ చంద్రబాబు నాయుడు చేసిన పథకంలో భాగంగానే ఇది జరిగింది.
ఈ కాలంలోనే తీవ్ర విద్యుత్ సంక్షోభం వచ్చి పీపుల్స్ వార్ నాయకత్వంలో దీనికి వ్యతిరేకంగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మిలిటెంట్ ఉద్యమాలు వచ్చాయి. సబ్సిడిలు రద్దు చేయడానికి, సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో చంద్రబాబు చేసిన ప్రయత్నాలను కూడా నిషేధంలో కొనసాగుతున్నా కూడా పీపుల్స్‌వార్, అది ఏర్పాటు చేసిన వివిధ ప్రజాసంఘాల మిలిటెంట్ ఉద్యమాల నిర్మాణం చేసినవి. వీటన్నీటిని ఎన్‌కౌంటర్ హత్యలు మాత్రమే కాకుండా, లొంగిపోయిన నక్సలైట్లను ప్రలోభపెట్టి మాజీ నక్సలైట్లకు భూములు, సెటిల్‌మెంట్లూ వంటి సులభ స్వయం ఉపాధి మార్గాలు చూపి, ఒక చిన్నపాటి సైన్యాన్ని నిర్మాణం చేసి, కోవర్టు ఆపరేషన్‌లు ప్రారంభం చేశాడు. 2000 నాటికి ఢిల్లీలో కేంద్రంలో నక్సలైట్ ప్రభావం గల రాష్ట్రాల సమావేశంలో చంద్రబాబు, దీనికొక పధకంగా కూడా ప్రవేశపెట్టాడు. పార్టీలో కోవర్టుల ద్వారా ఉద్యమాన్ని అణచాలని ప్రతిపాదించాడు.కరీంనగర్ జిల్లా కార్యదర్శి విజయ్‌ను ఆయన అంగరక్షకుడు జడల నాగరాజు చంపి, ప్రభుత్వం నుంచి బహుమానం తీసుకున్న ఉదంతం దీనికి తిరుగులేని ఉదాహరణ ఈ కాలంలోనే నయీం ముఠాతో పౌరహక్కుల సంఘం నాయకులు పురుషోత్తం, ఆజంఅలీలను కూడా చంపించాడు. చివరకు ఉన్నత పోలీసు అధికారుల కనుసన్నల్లోనే ఒక వైపు పీపుల్స్‌వార్ నాయకుల హత్యలు, మాఫియాల మాజీ నక్సలైట్ల పోషణ, హైదరాబాద్ నగరం చూట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం, సెటిల్‌మెంట్‌లు సాగుతున్నాయని, పౌరసమాజం కూడా భయభీతావాహ స్థితిలో మీడియా కూడా ఇవన్నీ వెలుగులకి తేవడంతో ప్రభుత్వానికి ఒక ఉన్నతాధికారి నాయకత్వంలో కమిషన్ వేయక తప్పలేదు. ఆ రంగాచారి కమిషన్‌కు పోలీసులు సహరించక ఆ విచారణ మూలపడింది.
ఒక్కమాటలో చంద్రబాబు అమలు చేస్తున్న ప్రపంచ బ్యాంక్ అభివృద్ది నమూనా అటు విప్లవోద్యమం నుంచి కింది నుంచి ప్రత్యామ్నాయ అభివృద్ది నమూనాను, తెలంగాణ నంచి మళ్లీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తెచ్చాయి.ప్రత్యామ్నాయ అభివృద్ది తీవ్ర నిర్బందానికి గురయి దెబ్బతింటున్న దశలో 1996 డిసెంబర్ చివరన ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సును ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టన్స్‌ఫోరం వరంగల్‌లో నిర్వహించింది. ఇక్కడే ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ డిక్లరేషన్ ప్రకటించబడింది. అప్పటికి తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఎందరో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న స్ధితి పత్తి రైతులను ఆత్మహత్యలకు పూనుకోకుండా, ప్రతిఘటనకు పూనుకోమని పిలపునిస్తూ జిల్లాలో పార్టీ విస్తృత ప్రచారం చేసి, వారికి అండగా నిలిచి, వారికి సహరించింది. వరంగల్‌లో జరిగిన ఈ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సుకు రెండున్నర లక్షల మంది వచ్చారు. 1996 తర్వాత మళ్లీ ప్రారంభమైన ఈ ఉద్యమం నుంచి వచ్చిన కొత్త గొంతే బెల్లి లలిత, తెలంగాణ కోయిలగా అనతికాలంలోనే పేరు తెచ్చుకున్న భువనగిరికి చెందిన ఈ మహిళను కూడా నయీం ముఠా పదిహేడు ముక్కలు చేసి చంపేసింది.
చంద్రబాబు కాలంలో అటు నక్సలైట్ ఉద్యమం మీద, ఇటు తెలంగాణ ఉద్యమం మీద జరుగుతున్న అణచివేత నేపథ్యంలో 1996లో ఏర్పడిన కన్‌సర్న్‌డ్ సిటిజెన్స్ కమిటీ ప్రభుత్వానికీ, పార్టీకీ మధ్యన చర్చల ప్రతిపాదన తెచ్చిందిఅప్పటికే నల్లమల ఉద్యమం మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎస్‌ఆర్ శంకరన్ కన్వీనర్‌గా ఏర్పడిన ఈ కమిటీని ప్రధానంగా వేథించిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో సాగుకు యోగ్యమైన భూములను లక్షలాది ఎకరాలు పడావుపడి ఉండడం. 2002 నాటికి అంటే అప్పటికే ఒక దశాబ్దంగా పీపుల్స్‌వార్ నాయకత్వంలో ప్రజలు స్వాధీనం చేసుకున్న భూములు, ఉద్యమ ప్రభావంతో ప్రజలు తాముగా స్వాధీనం చేసుకున్న భూములు, ఉద్యమానికి భయపడి పట్టణాలకు పారిపోయి వచ్చిన భూస్వాముల భూములను పోలీసు క్యాంపుల వల్ల కూడా సాగు కాకుండా ఉండి పోయాయి. దీని వల్ల ఉత్పత్పి కుంటు పడింది. అభివృద్ది ఆగిపోయిందని ఆవేదన చెందిన వీళ్లు ప్రధానంగా భూసంస్కరణల దృష్టితో చర్చల ప్రతిపాదన తెచ్చారు. శంకరన్ వంటి వాళ్లయితే ఈ భూములను ప్రభుత్వం ఎస్సి, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కొని భూమిలేని పేదలకు పంచాలని ప్రతిపాదించారు.
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో….