పథకం ఏదైనా ప్రారంభం కరీంనగర్‌ నుంచే

రైతుబంధుకు నేడు ఇందిరానగర్‌లో శ్రీకారం
సిఎం కెసిఆర్‌ చేతుల విూదుగా చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ
జిల్లాల్లో పాల్గొననున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
కరీంనగర్‌,మే9(జ‌నం సాక్షి): పథకం ఏదైనా ప్రారంభం కరీంనగర్‌లోనే. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక భూమిక పోషించిన ఈ జిల్లా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ మరో చరిత్రకుసాక్ష్యంగా నిలవబోతున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రైతుబంధు  పథకం ప్రారంభానికి సర్వం సన్నద్ధమైంది. బృహత్తరమైన కైతు పథకాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం ఉదయం 10 గంటలకు కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ సూర్యాపేటలో, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంత్రులు ఆయా జిల్లాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అదే సమయంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు చెక్కులను పంపిణీ చేయనున్నారు. గురువారం నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పంటసాయం చెక్కులతో పాటు పటిష్ఠమైన భద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదార్‌పాస్‌ పుస్తకాలు కూడా రైతుల చేతికి చేరనున్నాయి.  పెట్టుబడి పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.8 వేల చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా పండగలా ఈ కార్యక్రమం అమలకు రంగం సిద్దం అయ్యింది.  పంటకు రూ.4వేల చొప్పున వానకాలం, యాసంగి పంటలకు కలిపి ఎకరాకు రూ.8వేల చొప్పున ప్రభుత్వం నుంచి
రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది. రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే  ఆయా గ్రామాలకు పంపించారు. గురువారం 10న ఉదయం 11 గంటలకు కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌ శివారులో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 11.15 గంటలకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుంది. మరుసటి రోజునుంచి ప్రతి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పంపిణీకేంద్రాల వద్ద టెంట్లువేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలకు చేరిన పాస్‌పుస్తకాలు, చెక్కులను పరిశీలించి గ్రామాలవారీగా పంపించారు. ఏ గ్రామంలో ఏ రోజు కార్యక్రమం ఉంటుందో కూడా స్థానికంగా అందరికీ తెలియజేశారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ మంత్రులతోపాటు, అధికారులు కార్యక్రమం జరిగే రోజుల్లో గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు.  ఇప్పుడు వానకాలం పంట ప్రారంభానికి ముందే ఎకరాకు రూ.4వేలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఎవరైనా రైతులు విదేశాల్లో ఉన్నట్టయితే వారి కుటుంబసభ్యులకు చెక్కులు అందిస్తారు. అటవీ హక్కు చట్టం ప్రకారం ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా పొందిన /ూదాపు లక్ష మంది ఆదివాసీ గిరిజన రైతులకు కూడా ఈ సాయం లభిస్తుంది. రికార్డుల ప్రక్షాళనతో సమగ్ర డాటా ఈ పథకం కోసం పక్కాగా రికార్డులు రూపొందించడానికి అధికారయంత్రాంగం విశేషంగా కృషిచేసి తయారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించారు. సమగ్ర డాటా రూపొందించారు. ఆ ప్రకారం ఇప్పుడు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని, పాస్‌పుస్తకాలను అందించనున్నారు. 17 రకాల భద్రతా ఫీచర్లతో కొత్త పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను రూపొందించారు. 57,33,025 మంది రైతులకు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి రెవెన్యూశాఖ ప్రయత్నించింది. ఆధార్‌ సీడింగ్‌తో పాటు ఇతర సమస్యల కారణంగా 49,93,619 పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు మాత్రమే ముద్రించి ఇస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం ఒకవైపు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లుచేస్తూనే ఎప్పటికప్పుడు ఆధార్‌ సీడింగ్‌ పక్రియను కూడా నిర్వహిస్తున్నది. /ూష్ట్రంలో 72,09,694 ఖాతాలకు చెందిన 2,38,28,180 ఎకరాల భూమి రికార్డులను పరిశీలించిన అధికారులు.. 4,22,466 రైతు ఖాతాలకు చెందిన 16,53,421 ఎకరాలకు భూములు పలు వివాదాలలో ఉన్నట్టు నిర్ధారించి వాటిని పార్ట్‌ బీ కింద చేర్చారు. 67,87,228 ఖాతాలకు చెందిన 2,21,65,130 ఎకరాల భూమి ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్‌గా ఉన్నట్టు తేల్చారు. ఇందులో 10,54,203 ఖాతాలకు చెందిన 80,66,644 ఎకరాలు సాగుయోగ్యంకావని నిర్ధారించారు. వాటిలో గ్రామాలు, లేఔట్లు, అటవీభూమి, గుట్టలు, బంజర్లు ఉన్నాయి. 57,33,025 ఖాతాలకు చెందిన 1,40,98,486 ఎకరాల సాగుభూమి ఉన్నట్టు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ భూమి అంతటికీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి అందించాలని నిర్ణయించింది.
———————————