పది జిల్లాల తెలంగాణే కావాలి

దిగ్విజయ్‌ను కలిసిన టీ జేఏసీ
పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని టీ జేఏసీ నేతలు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కోరారు. సోమవారం టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆధ్వర్యంలో లేక్‌వ్యూ అతిథిగృహంలో ఉన్న దిగ్విజయ్‌ను జేఏసీ నేతలు కలిశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వెంటనే ప్రకటించాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా దిగ్విజయ్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం కోదండరామ్‌ మీడియాతో మాట్లాడుతూ, సభలు సమావేశాలు అంటూ జాప్యం చేయకుండా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్ముతారని ఇదే విషయాన్ని దిగ్విజయ్‌కు స్పష్టం చేశామన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టేవరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని తెలిపారు. ఇలాంటి ప్రకటనలకు పుల్‌స్టాప్‌ పెట్టించాలని కోరారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌ పార్టీ ప్రజలు బహిష్కరించి తీరుతారని స్పష్టం చేశారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని దిగ్విజయ్‌కు వివరించామన్నారు.