పదో తరగతి ఫలితాల్లో వెనుకబడిన జిల్లాలపై దృష్టిపెట్టాలి
పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన తొలి పదో తరగతి ఫలితాల్లో అనూహ్య మార్పులేమీ చోటుచేసుకోలేదు. గతంలో మాదిరిగానే ఫలితాల సరళి కొనసాగింది. ఈ యేడాది పదో తరగతి ఫలితాల్లో వరంగల్ జిల్లా అగ్రస్థానంలో నిలువగా అదిలాబాద్ జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ ఫలితాల్లో అబ్బాయిలకంటే అమ్మాయిలదే పైచేయి కనిపించింది. ఇక ఫలితాల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశం గురుకుల పాఠశాలల విద్యార్థులు సాధించిన ఫలితాలు. అన్ని రకాల పాఠశాలలను అంటే ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలనూ తలదన్ని గురుకుల పాఠశాలలు 92.99 శాతం ఫలితాలు సాధించి సత్తాచాటాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ గురుకుల పాఠశాలలు ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తే మరోవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలలు సున్నా శాతం ఫలితాలతో ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్నాయి. ఈ పరిస్థితి ఎందుకు దాపురిస్తోంది అన్న దానిపై సమగ్రంగా పరిశీలన జరిబి తగు చర్యలు తీసుకుంటేనే మున్ముందు ప్రభుత్వ పాఠశాలలకు చెడుపేరు రాకుండా ఉంటుంది. ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన వరంగల్ జిల్లా 91.6 శాతం ఉత్తీర్ణత సాధించింది. అయితే చివరి స్థానంలో నిలిచిన అదిలాబాద్ జిల్లా కేవలం 54.9 శాతంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాని పాఠశాలలు 28 ఉండగా ఇందులో 9 ప్రభుత్వ, 5 జేడ్పీ, 2 ఎయిడెడ్, 12 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ఇక అదిలాబాద్‌తో పాటు చివరి రెండు స్థానాల్లో అత్యల్ప రిజల్టు నమోదు చేసిన జిల్లాలుగా హైదరాబాద్, రంగారెడ్డిలు నమోదయ్యాయి. ఫలితాల సరళి ఈ రకంగా ఉండటానికి కారణాలను విష్లేషిస్తే ప్రధానంగా అదిలాబాద్ ప్రాంతంలో గిరిజనులు, దళితులు, పేదరికంతో మగ్గుతున్న వారు అధికంగా ఉన్నారు. వీరి పిల్లలను బడికి పంపీ పంపలేక తల్లిదండ్రులు అరకొర బడికి పంపడంతో ఫలితాల్లో ఆ ప్రభావం కనిపించింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డిల విషయానికొస్తే… ఇటీవల కాలంలో పల్లెల్లో ఉపాధి దొరకక పేద కూలీలంతా పొట్టచేటబట్టుకుని కుటుంబంతో సహా పట్నానికి వలసలు వస్తున్నారు. ఇక్కడ తమ పిల్లలను ఏ సర్కారు బడికో పంపుతూ విద్యావంతులను చేయాలని తపన పడుతున్నారు. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న పేద పిల్లలు తాము కూడా చదువుంటే పనికి వెళ్లడానికే ఎక్కువ అవసరం ఏర్పడుతుండటంతో బడికి సరిగ్గా హాజరు కాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. రాజధానిలో అన్ని హంగులతో కూడిన పాఠశాలలున్నా పరిక్ష రాస్తున్న వారిలో ఎక్కువశాతం మంది పేద బడుగు వర్గాల వారే ఉండటంతో ఫలితాల్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు కూడా వెనుకబడ్డాయి. అయితే అన్ని రకాల వనరులు ఉన్న ఇలాంటి ప్రాంతంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం బాధాకరమే. ఇందు కోసం ప్రభుత్వాలు సరైన ప్రణాళికలతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు మరిన్ని నిధులు కేటాయించి పక్కా ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరముంది. ప్రయివేటు పాఠశాలల్లో ఉత్తీర్ణత 92శాతం ఉంటే ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం కేవలం 63.3 శాతమే ఉంది. అంటే దాదాపు 30 శాతం వరకు ప్రయివేటు పాఠశాలలకంటే ప్రబుత్వ పాఠశాలలలు ఫలితాల్లో వెనుకబడి ఉంటున్నాయి. ఇది నిజానికి దిగ్భ్రాంతి కలిగించే అంశం. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి పాఠశాలలను నిర్వహిస్తుంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులను సరిగ్గా పట్టించుకోవట్లేదని వస్తున్న ఆరోపణలను నిజం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కొన్ని స్వచ్ఛంద సేవా సంస్ధలు, కొంత మంది అధికారులు చేస్తున్న కృషి అద్భుతం. ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 రోజులపాటు పరిక్షల సమయంలో వరంగల్ జిల్లాలో నిర్వహించిన శిబిరాలు మంచి ఫలితాలనిచ్చాయి. విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించి, సరైన పౌష్టికాహారం అందించిన కారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే చక్కటి ఫలితాలు సాధించారు. ఇక ఇప్పుడు విద్య పట్ల సమాజంలో అవగాహన పెరిగిపోతోంది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య లాంటి పథకాలను ఇప్పటికే ప్రభుత్వాధినేత ప్రకటించి ఉన్నారు. ఈ పథకం అమలు చేస్తే తెలంగాణలో విద్యావంతులు పెరిగి మానవ వనరులకు కేంద్ర బిందువుగా మారుతుంది. గతంలో పదో తరగతి ఫలితాల్లో వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లా వినూత్న రీతిలో ఫలితాలు సాధించటానికి అక్కడ కలెక్టర్‌గా పనిచేసిన గిరిజా శంకర్ నూతన పద్ధతులకు శ్రీకారం చుట్టారు. ఫలితం సాధించారు. ఇక వరంగల్ జిల్లా ఫలితాల్లో అగ్రగామిగా నిలవటానికి ఆ జిల్లా కలెక్టర్ చూపిన చొరవ కూడా కారణమనేది కాదనలేని నిజం. విద్యార్థులకు చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించేలా అధికారులను ఆదేశించి, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవటంతో జిల్లా ఫలితాల్లో నంబర్ వన్‌గా నిలిచింది. పాలనా యంత్రాంగం చొరవ చూపితే తామెందుకూ తీసిపోమని బడుగు విద్యార్థులు నిరూపిస్తున్నారు. పాలనా యంత్రాంగం మరింత చొరవ చూపితే అద్భుతాలు సాధించటంలో తెలంగాణ బడుగు విద్యార్థులు వెనకాడరని పలుమార్లు నిరూపితమైంది. విద్యలో వెనుకబడిన ప్రాంతాలపై, ఆయా పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ప్రభుత్వం సరైన రీతిలో స్పందిస్తే నూరు శాతం ఫలితాలు సాధించవచ్చు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు కావచ్చు.