పాక్‌లో 21 మంది సైనికులను కాల్చి చంపిన తాలిబన్లు
స్లామాబాద్: పాకిస్థాన్‌లో ఆదివారం జరిగిన రెండు ఉగ్రవాద సంఘటనల్లో 21 మంది సైనికులు, 19 మంది షియాలు చనిపోయారు. గురువారం పెషావర్ సమీపంలోని తనిఖీ కేంద్రాల నుంచి అపహరించుకు పోయిన 21 మంది సైనికులను తాలిబస్లు ఆదివారం కాల్చి చంపేశారు. పెషావర్ దగ్గర్లోని ఒక క్రికెట్ మైదానం వద్ద వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సైనికుల మృతదేహాలు జబాయి ప్రాంతంలో కనిపించాయి. ఉగ్రవాదుల
నుంచి ఇద్దరు సైనికులు మాత్రం తప్పించుకోగలిగారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని గంటలకే బెలూచిస్థాన్ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలో షియాలతో పొరుగు దేశం ఇరాక్‌కు వెళ్తున్న బస్సులు లక్ష్యంగా కొరు బాంబు దాడి జరిగింది. అప్పుడు పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్, ఘాంగ్,లాహోర్ నుంచి షియాలతో ఈ బస్సులు తాఫ్తన్ సరిహద్దు మార్గం వద్దకు వెళ్తున్నాయి. ఓ మార్కెట్ దగ్గర్లో రోడ్డు ప్రక్కన పేలుడు పదార్థాలున్న ఒక కారు సహా పలు వాహనాలు నిలిపి ఉన్నాయి. ఉగ్రవాదులు ఆ కారులోని విస్ఫోట సామాగ్రిని రిమోట్ కంట్రోల్‌తో పేల్చారు. పేలుడు ప్రభావంతో ఒక బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది చనిపోగా, 25 మంది గాయపడ్డారు. మరో బస్సులోని కొంత మందికి స్వల్పగాయాలయ్యాయి.