పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్‌లు షురూ..

హైదరాబాద్‌,డిసెంబరు 21 (జనంసాక్షి):తెలంగాణలో పాత పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లపై ధరణి పోర్టల్‌లో గందరగోళం ఏర్పడటంతో… తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులను ఆదేశించడంతో కొత్త పద్ధతిలో చేస్తున్న స్లాట్‌ బుకింగ్స్‌ను నిలిపివేశారు. కార్డు విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. ఐతే ఇప్పటికే స్లాట్‌ బుకింగ్స్‌ చేసుకున్న వారికి… కేటాయించిన తేదీల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు, డాక్యుమెంట్‌ రైటర్లతో పాటు ప్రజలు కూడా ఊపిరిపీల్చుకున్నారు. నేటి నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఊపందుకునే అవకాశముంది.హైకోర్టులో కేసుల వలన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు కొన్ని రోజులుగా ఇబ్బందులు తలెత్తాయి. ఆధార్‌ కాలమ్‌ను తొలగించే వరకు స్లాట్‌ బుకింగ్‌, ఖుఎఔ నిలిపివేయాలని, కులం, కుటుంబసభ్యుల వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దాంతో శనివారం సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో ఉన్నత స్థాయి సవిూక్ష జరిపారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి… ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులను ఆదేశించారు.