పారిశుద్ధ్య కార్మికులను రెచ్చగొట్టారు

C

– ఉద్యోగాలు ఊడి బజారున పడ్డారు

– రెండు సంవత్సరాలలో ‘గండిపల్లి’ పూర్తి

– హుస్నాబాద్‌ నియోజకవర్గంలో లక్షా యాభై వేల ఎకరాలకు నీరందిస్తాం

– సీఎం కేసీఆర్‌

కరీంనగర్‌,ఆగస్ట్‌8(జనంసాక్షి): కార్మికుల జీవితాలను నాశనం చేస్తూ పబ్బం గడుపుకోవడానికి విపక్షాలు వారిని సమ్మెబాట పట్టించాయని సిఎం కెసిఆర్‌ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలపై సీఎం కేసీఆర్‌ పరుష పదజాలాన్ని ప్రయోగించారు.  గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె దిక్కుమాలని సమ్మె అంటూ అభివర్ణించారు. జీహెచ్‌ఎంసీలో వెయ్యి మందికి ఉద్యోగాలు పోయిన పుణ్యం వాళ్లదేననిన, ఇష్టమొచ్చినట్లు సమ్మెలు చేస్తే అపాయింట్‌ మెంట్లు ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా గ్రామపంచాయితీ కార్మికులకు జీతాలు రాష్ట్రప్రభుత్వం ఇస్తుందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో అయినా ఇలా చెల్లిస్తున్నారా చెప్పాలన్నారు.  కార్మికులు పార్టీల మాటలుపక్కన పెట్టి విధుల్లో చేరాలన్నారు. విపక్షాలు బుద్ది తెచ్చుకుని నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తేనే ప్రజలు ఆదరిస్తారని, అప్పటివరకు విూ పప్పులు ఉడుకవన్నారు. విపక్షాల గగ్గోలుకు భయపడే ప్రభుత్వం ఇక్కడ లేదనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలన్నారు. యూనియన్‌ నాయకులు పనికిమాలిన దందాలు బంద్‌పెట్టాలని సూచించారు. పొద్దునలేస్తే బురద చల్లే దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలన్నారు. విపక్షాల పుణ్యమాని వెయ్యి మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే అడ్డగోలు సమ్మెలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన హుస్నాబాద్‌ మండలంలోని గండిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గండిపల్లి రిజర్వాయర్‌ను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని  చెప్పారు. గతంలో లాగా కాకుండా నీళ్లు పారేలా ప్రాజెక్టులు కట్టబోతున్నామని అన్నారు. ఇన్నేళ్లు పాలన చేసిన వారు ఈ ప్రాజెక్టును కడితే ఎవరన్నా వద్దన్నారా అని ప్రశ్నించారు. విపక్షాలు అభివృద్దిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. పనిలో పనిగా పారిశుద్యకార్మికుల సమ్మెపైనా ఆయన స్పందించారు. ఆయా పంచాయితీలు తమ ఆదాయం మేరకు జీతాలనుచెల్లిస్తాయని అన్నారు.  రిజర్వాయర్‌ ద్వారా 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.  హుస్నాబాద్‌ మండలంలోని మహాసముద్రం గండి అద్భుతంగా ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మహాసముద్రం గండిని పరిశీలించిన అనంతరం సీఎం ప్రసంగించారు.ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం కారణంగా గండి నాశనమైంది. గత పదేళ్లు గండిని ఏ గద్దలు మింగినయో అందరికీ తెలుసు. 45 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీ, 15 ఏళ్లు టీడీపీ పాలించాయి. 60 ఏండ్లు పాలించిన మొనగాళ్లు 6 కపిష్కల నీళ్లు కూడా తేలేదు. ఆంధ్రోళ్ల లాగా ప్రాజెక్టులు కడితే నీళ్లు రావన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కొన్ని రాజకీయ పార్టీల నేతల లేనిపోని రభస చేస్తున్నారు. అది మంచిది కాదన్నారు.  హుస్నాబాద్‌ నియోజకవర్గంలో లక్షా 50 వేల ఎకరాలకు సాగునీళ్లు రావాలి. అందుకు తగ్గ కృషి చేస్తాం. రెండేండ్లలో గౌడవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను పూర్తి చేసి రైతులకు మేలు కలిగేలా చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతదో మేము అదే చేస్తామని, మా బాస్‌లు ప్రజలేనని అన్నారు. ఎవరికీ భయపడేది లేదని, కూడా సపష్టం చేశారు.  చిన్న కాలువలు, టన్నెళ్లను పెద్దగా చేస్తామన్నారు. ఆంధ్రాపాలకులు ఆగమాగం చేసి ప్రాజెక్టులను ఎటు కాకుండా ఇష్టమొచ్చినట్లు రూపొందించారు. ప్రస్తుతం ప్రాజెక్టులను రీఇంజినీరింగ్‌ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌పై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కొంచెం శ్రద్ధ తీసుకుంటే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వివరించారు. పారిశుధ్య కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని, విపక్షాల మాటలు విని మోసపోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌ జిల్లాకు విచ్చేసిన ఆయన ముల్కనూరులో జరిగన కార్యక్రమంలో మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఆదాయ వనరులను బట్టే.. పారిశుధ్య కార్మికులకు జీతభత్యాలు చెల్లిస్తారని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదన్నారు. అలాగే ప్రజల సంఘటిత శక్తిని తెలియజేయడమే… గ్రామజ్యోతి కార్యక్రమం లక్ష్యమని సీఎం అన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చి తీరుతామన్నారు. అలాగే ప్రాజెక్ట్‌ల డిజైన్‌ మార్పుపై రాద్ధాంతం వద్దని ఆయన విపక్షాలకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గ్రామజ్యోతి మహా అద్భుతమైన కార్యక్రమం అని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్‌ ఏందో గ్రామజ్యోతి చెప్తది అని తెలిపారు. గ్రామజ్యోతి ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి నాలుగేళ్ల ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. మురికి కూపాలుగా ఉన్న గ్రామాలను పూర్తిగా మారుస్తామని

స్పష్టం చేశారు. గ్రామజ్యోతికి ఆయా గ్రామాల జనాభా ప్రతిపాదికన నిధులు విడుదల చేస్తామన్నారు. మండల కేంద్రాలకు ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. ఇక త్వరలోనే గ్రామజ్యోతిని అమలు చేస్తామన్నారు. ఇక ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరని తెలిపారు. త్వరలోనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని పునరుద్ఘాటించారు. అందరికీ ఒకే సారి కాకుండా దశల వారీగా అర్హులైన ప్రతిఒక్కరికీ ఇండ్లు కట్టించి ఇస్తామని ఉద్ఘాటించారు.  రాబోయే రోజుల్లో వంద శాతం కరెంట్‌ సరఫరా చేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు. వృద్ధులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 పెన్షన్‌ ఇస్తున్నాం. కళ్యాణలక్ష్మి కింద దళిత, గిరిజన అమ్మాయిల వివాహాలకు రూ. 51 వేలు ఇస్తున్నామని గుర్తు చేశారు.

విపక్షాలది రాద్ధాంతమన్న సిఎం

అభివృద్దిని అడ్డుకోవడమే లక్ష్యంగా విపక్షలు రాద్ధాంతం చేస్తున్నాయని సిఎం కెసిఆర్‌ మండిపడ్డారు. అభివృద్ది చేస్తుంటే ఏదో రకంగా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. లేనిపోని పంచాయితీ పెట్టి పారిశిద్దయ కార్మికులను రెచ్చగొట్టి సమ్మె చేయిస్తున్నాయని అన్నారు. పంయాయితీ కార్మికుల జీతాలు ఆయా పంచాయితీలే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 30 శాతంనిధులు మాత్రమే పంచాయితీలకు ఖర్చు చేసే అధికారం ఉండేదని, ఇప్పుడు దానిని 50 శాతం పెంచేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటికైనా సమ్మె విరమించి కార్మికులు డ్యూటీలో చేరాలన్నారు. వీరి సమ్మెవల్ల ఎందరో ఉద్యోగాలు కోల్పోయాన్నారు. ఇకముందు ఈ యూనియన్లు పనిచేయవన్నారు. విపక్షాలు సచివాలయానికి వచ్చి ధర్నా చేస్తే పోలీసులు అరెస్ట్‌ చేయక ఏం చేస్తారని ప్రశ్నించారు. గల్మకు అడ్డంపడితే ఈడ్చుకుని వెళ్లక ఏం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే వడిత సతీష్‌ కుమార్‌, జడ్పీ ఛైర్మన్‌ తుల ఉమ, ఎమ్మెల్యే బోడిగే శోభ తదితరులు పాల్గొన్నారు. సిఎం రాకతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.