పారిశ్రామిక విద్యుత్ కోతలుండవు
– డెక్కెన్ ఆటో లిమిటెడ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,జులై11(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తున్నదని సిఎం కేసీఆర్ అన్నారు. ఇందులో ప్రధానంగా మౌళిక వసతుల కల్పనతో పాటు, విద్యుత్ సమస్య లేకుండా చేశామని అన్నారు. మెదక్ జిల్లాలోని జిన్నారం మండలం కొడకంచిలో డెక్కన్ ఆటో లిమిటెడ్ పరిశ్రమను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బస్ బాడీ యూనిట్ ద్వారా ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. తెలంగాణలోనే మొట్టమొదటి బస్‌బాడీ యూనిట్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. పారిశ్రామికరంగంలో రాష్ట్రం దూసుకుపోతోంది. నూతన పారిశ్రామిక విధానంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయని, తెలంగాణలో బస్సు నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినందుకు డెక్కన్ ఆటో ఎండీకి సిఎం శుభాకాంక్షలు తెలిపారు. ఇక నుంచి పరిశ్రమలకు పవర్ కట్స్ ఉండవని మరోమారు సిఎం ప్రకటించారు. 25000 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. దరఖాస్తు చేసుకున్న 11 రోజుల్లోనే 17 కంపెనీలకు అనుమతులు ఇచ్చిన ఘనత తెలంగాన ప్రభుత్వానిదన్నారు. గోవా, అమృత్‌సర్, చండీగఢ్ కస్టమర్లకు కీస్ ఇవ్వడం ఆనందంగా ఉంది. త్వరలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి డెక్కన్ కంపెనీకి ఆర్డర్స్ ఇస్తామన్నారు. డెక్కన్ ఆటో మొబైల్ పరిశ్రమలో బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సందర్భంలో ఇక్కడి పారిశ్రామిక విధానాలపై అవలంబిస్తున్న తీరును వివరించారు. తన కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి పారిశ్రామిక అనుమతలును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఆలస్యం అయితే రోజుకు వేయి రూపాయల జరిమానా విధించేలా చర్యలు తీసుకున్నామని సిఎం చెప్పారు. తెలంగాణ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నడానికి నేటి డక్కన్ బస్ పరిశ్రమ ప్రారంభోత్సవమే నిదర్శనమన్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో 25వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశారు. డెక్కన్ ఆటో మొబైల్ పరిశ్రమ మరింత విస్తరించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ పటాన్‌చెరులో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ఇదిలావుంటే పాతవాసన పోవడం లేదన్న విషయాన్ని ఆయనే చెప్పారు. న బస్ బాడీ యూనిట్ ను కెసిఆర్ ప్రారంభించిన సందర్బంగా చేసిన ప్రసంగంలో ఒకసారి ఎపిఎస్‌ఆర్ టిసి అని అన్నారు.ఈ బస్ యూనిట్ కు మూడు రాష్టాల్ర నుంచి ఆర్డర్లు వచ్చాయని, వారికి తనతో తాళాలు అందచేయించారని, త్వరలోనే ఎపిఎస్ ఆర్టిసి నుంచి కూడా ఆర్డర్లు వస్తాయని అన్నారు. అప్పుడు వెనుక నుంచి అధికారులు టిఎస్ ఆర్టిసి అని కెసిఆర్ తెలిపారు. అప్పుడు కెసిఆర్ సర్దుకుని పాత వాసన పోవడం లేదు అని చమత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో దక్కన్ బస్ బాడీ పరిశ్రమను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తెలంగాణలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.