పార్టీ పటిష్టత కోసం నిరంతరంగా శ్రమిస్తాం
కొత్త జిల్లాల టిఆర్ఎస్ అధ్యక్షుల ప్రకటన
జిల్లాలో బిజెపికి స్థానం లేదన్న జీవన్ రెడ్డి
నిజామాబాద్,జనవరి27(జనం సాక్షి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ బలోపేతం లక్ష్యంగా పనిచేస్తామని టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షులు ప్రకటించారు. నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, బిజెపికి స్థానం లేకుండా చేస్తామని జీవన్ రెడ్డి, ముజీబుద్దీన్‌లు అన్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు నిరంతరం శ్రమిస్తానని నిజామాబాద్ అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబడెతానని అన్నారు. జిల్లా అధ్యక్షునిగా ఆయనను నియమించడంపట్ల కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ స్వతహాగా ఈసారి ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవకాశం కల్పించడం వల్ల పార్టీ మరింత దూసుకుని పోతుందని అన్నారు. తనను నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షిడిగా నియమించిన సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వస్తానని, జిల్లాలో పార్టీని మరింత బలోపేతనాకి కృషి చేస్తానని జీవన్‌రెడ్డి అన్నారు. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలమైననేతలుగా ఉన్న ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పజెప్పారు. ఆర్మూర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్‌రెడ్డి అసెంబ్లీతో పాటు ఇతర వేదికల్లో పార్టీ తరఫున దూకుడుగా పాల్గొంటున్నారు. పార్టీ ఉద్యమకాలంలో పనిచేసిన ఆయన ఆర్మూర్ వేదికగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. టీఆర్ఎస్ తరఫున రెండో దఫా ఎన్నికై శాసన సభ్యునిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మరో రెండేళ్లలోపే ఎన్నికలు ఉండడంతో పార్టీ కార్యకలాపాలను విస్తృతపరిచేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలను అధ్యక్షులుగా అవకాశం కల్పించారు. ఎక్కువగా యువకులకు పెద్దపీట వేశారు. జిల్లాలో కీలకంగా వ్యవహరించాల్సి ఉండడంతో ఆయనను నియమించినట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాలు పెరుగుతున్న సమయంలో ఆయనను జిల్లా అధ్యక్షునిగా నియమించారు. జీవన్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా మొట్టమొదటి అధ్యక్షుడిగా పార్టీ విధేయుడికే పార్టీ అధిష్ఠానం పట్టం కట్టింది. కామారెడ్డికి చెందిన మాజీ డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్‌కు జిల్లా అధ్యక్ష పదవిని ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టబెట్టారు. పార్టీ సమావేశాలకు ముందుగా వెళ్లి సభలు, సమావేశాలకు దగ్గరుండి పనిచేసే నాయకునిగా గుర్తింపు పొందిన ముజిబుద్దీన్‌కు టీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపును ఇచ్చింది. గతంలో కామారెడ్డి పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పని చేయడమే కాకుండా, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే కాకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో, వరంగల్, గజ్వెల్, హైదరాబాద్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి సమావేశాలన్నింటికీ తానై పార్టీ కోసం పని చేయడంతోనే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు విధేయుడిగా పని చేశారు. పార్టీ కోసం ఎక్కడ పిలుపునిచ్చినా అక్కడికి వెళ్లి పార్టీ బ్యానర్లు, కటౌట్ల ఏర్పాట్లు సభ సమావేశ స్థలాలు ఏర్పాటు చేయడంలో కీలకంగా పని చేయడంతో అధిష్ఠానం దృష్టిలో మంచి విధేయుడిగా పేరు పొందారు. కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవిని మొదటిసారిగా ముజిబుద్దీన్‌కు అధిష్ఠానం కట్టబెట్టడంతో ఆయన సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించినట్లయింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌లకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని పార్టీ పటిష్టవంతానికి మరింత కృషి చేస్తానని ముజిబుద్దీన్ తెలిపారు. పార్టీ పదవిని కట్టబెట్టినందుకు అధిష్ఠానానికి కృతజ్ఞతలను తెలిపారు.జిల్లాలో పార్టీని అన్ని మండలాల్లో నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టవంతం చేయడం తో పాటు రాష్ట్రంలోనే కామారెడ్డి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును ముందుగా చేయించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో పార్టీ పటిష్టతకు పనిచేస్తానని ముజిబుద్దీన్అన్నారు.