పాలకులకు పట్టని పసుపు రైతుల ఆందోళన
గిట్టుబాటు ధరల కోసం పసుపురైతు పోరు
నిజామాబాద్,మార్చి7(జనం సాక్షి): నిజామాబాద్ పసుపు మార్కెట్‌పై వ్యవహారం ఎటూ తేలకపోవడం, పసుపు బోర్డుకు బదులు స్పైసెస్ బోర్డు ప్రకటించినా అది తేలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాతోపాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి వేల పసుపు బస్తాలను తీసుకొస్తున్న రైతుల సమస్యలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. మద్ధతు ధర, ఇతర సమస్యను తీర్చేవారే కరువయ్యారు. పసుపు రైతులను ఏళ్ల తరబడి ఎన్నికలకు అస్త్రాలుగా వాడుకొని లబ్ది పొందిన నేతలు పసుపు ధరపై పట్టించుకోవడం లేదు. దీంతో ఇటీవల మద్దతు ధరల కోసం జగిత్యాలలో పసుపు రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిజామాబాద్ మార్కెట్ లో పసుపు ధర రోజురోజుకూ తగ్గుతోంది. ఏళ్ల తరబడి సాగుచేస్తున్న రైతులకు ఈ యేడు వచ్చినంత తక్కువగా ఏ సంవత్సరం రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు కొనుగోళ్లపై దృష్టి సారించకపోవడం వల్ల ధర పెరగలేదు. జాతీయ, అంతర్జాతీయ ప రిస్థితుల నేపథ్యంలో వ్యాపారులు ఒడిదొడు కులను, పాత స్టాక్‌ను దృష్టిలో పెట్టుకొని కొ నుగోలు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే తక్కువ ధరకు పసుపు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. భారీగా పసుపు వచ్చిన ధర మాత్రం మారడంలేదు. క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.5వేల మధ్యనే ధర నిర్ణయిస్తున్నారు. పసుపునకు మద్దతు ధర కల్పిస్తాం అని ఏళ్ల తరబడి వాగ్దానాలు చేస్తున్నా ధరలు మాత్రం రావడం లేదు. ఆంధప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం క్వింటాలు కు రూ.6850 నిర్ణయించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయిస్తే తమకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ అయిదేళ్లలో పసుపు ధర భారీగా తగ్గింది. కూలీలు, ధరలు, ఎరువులు, ఇతర రసాయనాల ధరలు పెరిగాయి. రైతులకు మ్యాచింగ్ గ్రాంట్‌లాగా నిధులను విడుదల చేసి పసుపు రైతులకు ఇవ్వాలని కోరుతున్నారు