పాలమూరు ఎత్తిపోతల పథకంతో ఇబ్రహీంపట్నంకు మహర్దశ
– మంత్రి:హరీశ్
హైదరాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇందు కోసం పలు చర్యలు చేపడతామని వెల్లడించారు. దీనిని మినీ ట్యాంక్‌బండ్‌గ ఆమారుస్తామని అన్నారు. సోమవారం ఆయన హయత్‌నగర్‌లో ప్యాసెంజర్ ఎమినిటీ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఇబ్రహీంపట్నం చెరువును నింపుతామని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం చెరువు 20 నుంచి 30 ఊళ్లకు నీళ్లు అందించే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్రహీంపట్నం చెరువును పట్టించుకోలేదన్నారు. త్వరలోనే ప్రతి మహిళా గ్రూప్‌కు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో మంత్రి హరీష్‌రావు ఎమినిటీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ముందుకొచ్చినపుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
గత ప్రభుత్వాలు ముఖాలు చూసి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాయని మంత్రి హరీష్ విమర్శించారు. తమ ప్రభుత్వం అర్హులైన మహిళలందరికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తుందని తెలిపారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అభయహస్తం పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. వీఏవోలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. రూ.35 వేల కోట్ల వ్యయంతో ఇంటింటికి మంచినీటిని అందిస్తామన్నారు. ప్రభుత్వం ఏ మంచి పని చేపట్టినా కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రి స్థానంలో కొత్త భవనాన్ని నిర్మింపజేస్తామన్నారు. గరీబోళ్లకు మెరుగైన వైద్యం అందిస్తామంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానిక పగటిపూట 9 గంటల విద్యుత్‌ను ఇస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో రంగారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరానికి సాగునీరు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఎండా కాలంలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. రాబోయే రోజుల్లో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రతీ నిమిషం పేదల గురించే ఆలోచిస్తున్నారని వెల్లడించారు. పేదల కడుపులు నిండేందుకు మనిషికి ఆరు కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నామని తెలిపారు.