పాలస్తీనాతో మ్యాచ్‌కు భారత ఫుట్‌బాల్‌ జట్టు ఎంపిక

న్యూఢిల్లీ ,జనవరి 29 : వచ్చే వారం కొచ్చిలో పాలస్తీనాతో జరగనున్న సాకర్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. కోచ్‌ విమ్‌ కోవర్‌మ్యాన్‌ 23 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు.కెప్టెన్‌ సునీల్‌ ఛత్రి సారథ్యంలోని జట్టులో ముగ్గురు గోల్‌ కీపర్లను ఎంపిక చేశారు. ఇటీవల నెహ్రూ కప్‌ గెలుచుకున్న జట్టునే పాలస్తీనాతో స్నేహపూర్వక మ్యాచ్‌లోనూ కొనసాగించనున్నారు. ఇటువంటి మ్యాచ్‌లు మరిన్ని జరిగితే జట్టుకు చాలా ఉపయోగపడుతుందని కోచ్‌ కోవర్‌మెన్‌ చెప్పాడు. అటు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు ఇదొక మంచి అవకాశంగా కెప్టెన్‌ సునీల్‌ ఛత్రి వ్యాఖ్యానించాడు. కేరళలో ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని , ఈ మ్యాచ్‌ ఏర్పాటు చేసిన ఫెడరేషన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్టు వివరించాడు. ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6న ఈ మ్యాచ్‌ జరగనుంది. కొచ్చి దీనికి వేదిక కానుండగా… చెన్నైకి చెందిన రిఫరీ ఎ రోవన్‌ను సత్కరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.