పాలేరుపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
ఖమ్మం,మే7(జనంసాక్షి): పాలేరు ఉప ఎన్నిక ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణపై కలెక్టర్ దాన కిషోర్ అధికారులతో సవిూక్షించి వారికి తగిన సూచనలు చేశారు. పోలింగ్ ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.
ఓటర్లలో ఉన్న అపోహలను తొలగించడానికి పాలేరు ఉప ఎన్నికల్లో వీవీ ప్యాట్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారన్నారు. తాను వేసిన ఓటు వేరొకరికి నమోదైందని పోలింగ్ అధికారికి చెప్పినట్లయితే.. తిరిగి పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల అధికారుల సమక్షంలో ఫారం 49 ఎంఏలో ఓటరు స్వీయ ధ్రువీకరణ తీసుకుని మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తారన్నారు. ఒకవేళ గతంలో వేసిన ఓటు సక్రమంగానే నమోదైతే సదరు ఓటరుపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతారని వివరించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు జరుగుతుందన్నారు. వీవీ ప్యాట్ ముద్రణ పరికరం ద్వారా ఓటు ఎవరికి వేసింది పరిశీలించుకోవచ్చన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో దీన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్లు వివరాలు ముందుగా అధికారులకు అందించాలని, ఫొటో గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించరని చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్లు కాని వారిని లోనికి రానీయరని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పక్రియ అత్యంత కీలకమైనందున వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాలని చెప్పారు.
విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.