పిట్టల్లా రాలుతోన్న పసిమొగ్గలు
అభం శుభం తెలియని మక్కుపచ్చలారని పసి మొగ్గల్ని చిదిమేస్తున్నారు. పౌష్టికాహారలోపంతో చిన్నారుల జీవితాలు అప్పుడే తెల్లారిపోతున్నాయి. ఈ సమస్య మన దేశంలోనే కాదు వర్ధమాన దేశాల్లోనూ అధికంగానే ఉంది. మన దేశంలో సంవత్సరానికి పుట్టిన శిశువులు 25 లక్షల మంది చనిపోతున్నారు. ఐదేళ్లు పూర్తి కాకుండానే 32 లక్షల మంది శిశువులు మృత్యువాతపడుతున్నారు. పౌష్టికాహార లోపంతోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత తాండవిస్తుంది. జానెడు పొట్ట నింపుకోవడానికై పీడిత తాడిత ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆకలి కేకలతో కోట్లాది మంది తనువు చాలిస్తున్నారు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఐరన్‌శాతం తక్కువగా ఉండడంతో బుద్ధిమాంద్యంతో వికలాంగులుగా మారుతుతున్నారు. 52 శాతం మంది గర్భిణులు రక్త హీనతతో బాధపడుతున్నారు. మన దేశంలో ముప్పైశాతం పోషకాహారం లోపంతో మరణిస్తున్నారు. దీంతో గర్భస్రావాలు కావడం, ఎదుగుదల లేని పిల్లలు, మృత శిశువులు పుట్టడం పుట్టిన పిల్లలకు కనీసం తల్లి పాలు లభించని దుస్థితి నెలకొంది. వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేయడంతో సర్కార్ దవాఖానాల్లో వైద్యం పడకేసింది. ప్రాణంతకమైన వ్యాధులు చిన్నారులను మింగేస్తున్నాయి. చాలీచాలని మందులు వైద్యులతో దవాఖానాలు కునారిల్లుతున్నాయి. దీంతో సర్కార్ దవాఖానాలలో వైద్యం చేయించుకోవాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అరకోరగా టీకాలు వేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. 2011-12 వరకు ఒక లక్ష ఇరవై ఐదు వెల మంది జన్మించగా 15,000 వేల మంది శిశువులు మృతి చెందారు. 2012-13 లో మరణాలు కాస్తా పెరిగాయి. ఇవన్నీ వైద్య సదుపాయాలు అందుకే నీటి కాలుష్యం పరిశుభ్రతలోపం ములంగా చిన్నారులు వ్యాధుల బారినపడుతున్నారు. కలుషిత నీటి ములంగా డయేరియా, పరిసరాలు అపరిశుభ్రత వల్ల న్యూమోనియా, డెంగీ, మలేరియా, కలరా, చికున్‌గున్యా, స్వైన్ ప్లూ బారినపడి వేలాది మంది చిన్నారులు మృతి చెందుతున్నారు. 2013లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యానికి సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో అరకొర వసతులతో ఆస్పత్రుల్లో సేవలందుతున్నాయి. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు, మందుల కొరతతో దారుణంగా ఉంది. ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత తీవ్రంగా ఉండటంతో దీనిని సాకుగా చేసుకుని ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అందినంతగా డబ్బులు గుంజుతున్నాయి. కార్పొరేట్ ఆసపత్రుల యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు వైద్యం కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేచఅయించుకోలేక తనువు చాలిస్తున్నారు. శ్వాస కోశ వ్యాధుల నివారణకుయ టీకా ఉన్నకప్పటికీ ప్రభుత్వ దవాఖానాల్లో లేవు. టైఫాయిడ్, స్వైన్‌ప్లూ, పచ్చకామోర్లు మొదడువాపు వ్యాధి నివారణకు ప్రభుత్వ దవాఖానాల్లో మందులు అందుబాటులో లేక ప్రయివేట్ ఆసుపత్రులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. టీకాల కోసం పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు గుంజుతున్నారు. ఇప్పటివరకు పలు సర్వేల్లో న్యూమోరియా వ్యాధి వల్ల చిన్నారులు ఎక్కువగా మరణిస్తున్నట్లుగా తేలింది. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం పడకేయడంతో కార్పొరెట్ దవాఖానాల్లో దోపిడీ పెరిగింది. పాలుతాగే పిల్లలు మయమైపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలయింది. ఒడిషా, తమిళనాడు, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రెండు లక్షల ఇరవైఐదు వేల మంది కనిపించకుండా పోయారు. వీరి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. వారు బతికున్నారో చనిపోయరో తేలియని పరిస్థితి. నిత్యం దేశంలో ఐదు వందల మంది వరకు చిన్నారులు అపహరణకు గురవుతున్నట్లుగా అంచనా. వారిలో పలువురి ఆచూకీ ఆ తర్వాత కూడా లభ్యం కావడం లేదు. కొందరి మృతదేహాలు దొరుకుతున్నాయి. అపహరణకు గురైన వారిలో క్షేమంగా ఇళ్లకు చేరే వారి సంఖ్య బహు స్వల్పం. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్న ఈ దురాగతాలపై ప్రభుత్వాలు తమకేమిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఆడపిల్లలను వ్యభిచార కూపాలకు తరలించే ముఠాలు మన రాష్ట్రంలో 25క ిపైగా ఉన్నాయని సీఐడీ లెక్కలు చెబుతున్నాయి. పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలను ఎదో ఒక విధంగా లోబర్చుకుని వ్యభిచార కూపానికి చేరుస్తున్నారు. మరికొంతమందిని కిడ్నాప్ చేసి అక్రమంగా తరలిస్తున్నారు. సౌదీ, అరెేబియా తదితరయ దేశాలకు సరఫరా చేస్తున్నారు. పిల్లల అదృశ్యంపై ప్రభుత్వాలు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బాలికలు, పిల్లల అదృశ్యం భారత సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీవాట్లు పెట్టినా దున్నపోతుమీద వానపడిన చందమే. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని పిల్లల రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎంతో ఉజ్వల భవిత ఉన్న వారి జీవితాలు చీకట్లోకి నెట్టివేయబడుతున్నా పాలకుల్లో చలనం ఉండటం లేదు. పేద కుటుంబాల అవసరాలను ఆసరగా చేసుకొని వారికి ఎంతో కొంత ముట్టజెప్పి అభం శుభం తెలియని బాలికలను సరిహద్దులు దాటిస్తున్నారు. అలా తరలించిన వారు ఏమవుతున్నారో.. అసలున్నారో లేదో కూడా తెలియడం లేదు. నాలుగు నుంచి పదిహేనేళ్ల పిల్లలను కిడ్నాప్ చేస్తే భారత నేరశిక్షాస్మృతిలోని 363 విభాగాల కింద పోలీసు ఠాణాల్లో అపహరణ కేసు నమోదు చేస్తున్నారు. పిల్లలు అదృశ్యమవుతున్నరని కేసులు నమోదు చేసి మిస్టరీ కేసులుగా పేర్కొంటూ వదిలేస్తున్నారు. నామమాత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకుంటున్నారు. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అన్న కార్ల్‌మార్క్స్ మాటలు కొన్ని ఉదంతాల్లో నిజం కావడం దురదృష్టకరం. అంతులేని పేదరికంలో మగ్గుతున్న తల్లిదండ్రులే కన్నపేగుల్ని అంగడి సరుకులుగా మారుస్తున్న ఉదంతాలు మన అభివృద్ధిని, పురోగమనాన్ని ప్రశ్నిస్తున్నాయి బాలికలపై హత్యలు, అత్యాచారాలు చేసి పైశాచిక ఆనందం పొందడం ఇటీవల కాలంలో పేట్రేగిన మరో ఉన్మాథం. వావివరుసలు మరచి బాలికలపై అనుచితంగా ప్రవర్తించే మృగాళ్లు మన చుట్టూనే తిరుగుతున్నారు. పిల్లల వలసల నిరోధానికి తీసుకొచ్చిన చట్టాల అమలు అంతంతమాత్రంగానే ఉండటం కిడ్నాప్ రాకెట్లకు కలిసివస్తోంది. ఎన్ని కఠిన చట్టాలున్నా బాల కార్మికులు మనకు ప్రతినిత్యం దర్శనమిస్తూనే ఉన్నారు. బతుకు భరోసాలేక చెత్తకుప్పల్లో, హోటళ్ల వద్ద పడేసిన పాచిపోయిన, పాడైన అన్నం తిని కడుపునింపుకునే దుస్థితిలో నేటి బాలలున్నారు. మరికొందరు అభివృద్ధి నీడైన సోకని మారుమూల పల్లెల్లో కనీసం చదువుకోలేని దుస్థితిలో ఎందరో బాలలు బతుకులీడుస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం, కామాంధుల దాష్టీకం, తరతరాలుగా పట్టిపీడిస్తున్న పేదరికం, ఆర్థిక అసమానతలు బాలలను చిదిమేస్తున్నాయి. ఇప్పటికైనా వీటికి చరమగీతం పాడకుంటే మనల్ని ఎవరూ క్షమించరు.
– దామరపల్లి నర్సింహారెడ్డి,
సెల్ : 9059933253.