పునరావాస కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

 

జూలై12(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వరద బాధిత పునరావాస కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను ఆయన అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా.. కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని, చెరువుల్లో వాగుల్లో కుంటల్లో చేపల వేటకు వెళ్లి గల్లంతవ్వడం, విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోవడం లాంటి ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్షాలకు వరదలతో వాగులు, కుంటలు, చెరువులు కాలువలు నీటి ప్రవాహంతో పొంగిపొర్లు తున్నాయని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన రాకపోకలు నియంత్రించాలని అధికారులకు సూచించారు. ప్రమాదాల బారిన పడకుండా వారిని సంరక్షించాలని, జిల్లా యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేస్తుందని అత్యవసర పరిస్థితుల్లో టోల్ఫీ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, వారిని సంప్రదించాలని తెలిపారు. రాబోవు 2 రోజులు వర్ష సూచన ఉన్నందున, ప్రజలు గ్రామస్తులు అత్యవసరమైతేనే బయటకు రావాలని, నానిన గోడలు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించనైనదని, ప్రజలు, గ్రామస్తులు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. మండల కేంద్రంలోని గోదావరి, కిన్నెరసాని ఉధృతిని పరిశీలించి చేపల వేటకు గ్రామస్తులను వెళ్లనీయకుండా అధికారులు చొరవ తీసుకోవాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీవో వివేక్ రామ్, ఎంపీ ఓ సునీల్ శర్మ, ఎస్సై జీవన్ రాజ్, మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి అధికారిని నిర్మల, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న, పంచాయతీ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు