పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయండి
– భక్తులకు అసౌకర్యాలు కలుగద్దు
– అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
కరీంనగర్ జూలై 13 (జనంసాక్షి):
144 ఏండ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుపుకోవడం శుభపరిణామమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పుష్కర ఏర్పాట్లపై సోమవారం ధర్మపురి హరితప్లాజాలో సీఎం సవిూక్ష నిర్వహించారు. పుష్కర ఏర్పాట్లను ఎప్పటికపుడు సవిూక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గోదావరి ఒడ్డున ఉండే దేవాలయాల్లో భక్తుల రద్దీ సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా దేవాలయాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాల్లో క్యూలైన్ల నిర్వహణ పకడ్బంధీగా ఉండాలన్నారు. పుష్కరాలను కలెక్టర్లు కూడా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ ద్వారా నీళ్లు నిరంతరం అందించాలని సూచించారు.గోదావరి మహా పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. పుష్కరాలు జరిగే జిల్లాలకు సంబంధించిన మంత్రులు, కలెక్టర్లు, ఇతర అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సవిూక్షా సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలి తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు అట్టహాసంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాసర నుంచి భద్రాచలం వరకు పుష్కరఘాట్లు కళకళలాడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా మంగళవారం ప్రారంభం కానున్నాయి. 14 నుంచి ప్రారంభమయ్యే పవిత్ర పుష్కరాలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద కుటుంబ సమేతంగా పుష్కరస్నానం ఆచరించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లన్నింటినీ పూర్తిచేశారు. సీఎం సోమవారం సాయంత్రం ధర్మపురికి చేరుకోనున్నారు. ధర్మపురిలో మొత్తం 5 పుష్కరఘాట్లతో పాటు అశేష భక్తుల సౌకర్యార్థం బాసర నుంచి చెన్నూరు వరకు అధికారులు 38 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పుష్కరఘాట్లు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలంకరణతో ఆలయాలు, పుష్కరఘాట్లకు కొత్త శోభ సంతరించుకుంది. పుష్కర శోభతో పుణ్యక్షేత్రాలు కళకళలాడుతున్నాయి. స్వరాష్ట్రంలో తొలిసారిగా జరగబోయే పుష్కరాలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఐదు జిల్లాల్లో వందకు పైగా పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం ఆలయాలను ముస్తాబు చేశారు. ఈ ప్రాంతాలకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పుష్కరఘాట్లలో నీటి కొరతను అధిగమించేందుకు సవిూప ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. వేలాది మంది పోలీసులతో పుష్కరాలకు బందోబస్తు కల్పిస్తున్నారు. పుష్కరాలను పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలు రంగంలోకి దిగనున్నాయి. ఈ కెమెరాలు చోరీలతో పాటు తదితర కదలికలను బంధించనున్నాయి. పుష్కరఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి పుష్కరాలకు భద్రాద్రి ముస్తాబైంది. అధికారులు భద్రాచలం రామాలయంతో పాటు 8 చోట్ల పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు. సారపాక అటవీప్రాంతంలో నిర్వహించనున్న విశ్వశాంతి మహాయత్నం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆధ్యాత్మిక గురువు శ్రీ చిన్నజీయర్ స్వామి ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. మంగళవారం ఉదయం 6.26 నిమిషాలకు చిన్నజీయర్ స్వామి పుష్కరాలను ప్రారంభించనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుష్కరాలపై ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ సాయంత్రం భద్రాద్రికి చేరుకోని పుష్కర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కరీంనగర్‌లో గల ధర్మపురి దగ్గర గోదావరి నదికి నీటి ఉధృతి పెరిగింది. భక్తుల సౌకర్యార్థం పుష్కరాల కోసం కడెం, ఎస్సారెస్సీ ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. కడెం నుంచి 4 వేలు, ఎస్సారెస్పీ నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా ఎల్లపల్లి నుంచి మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా పుష్కరాల దృష్ట్యా గోదావరికి నదికి నీటిని విడుదల చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును ఫోన్‌లో సంప్రదించారు. మంగళవారం నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిజామాబాద్ నుంచి బాసర వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్, నిజామాబాద్ వైపు నుంచి బాసర వచ్చే భక్తులకు పోలీసులు సూచనలు చేశారు. పుష్కరస్నానం అనంతరం బైంసా, నిర్మల్ విూదుగా హైదరాబాద్, నిజామాబాద్ వెళ్లాలని సూచించారు. వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమని తెలిపారు.