పెద్దపల్లిలో నెగ్గిన అవిశ్వాసం

పదవి కోల్పోయిన మేయర్‌ లక్ష్మీనారాయణ

నెగ్గిన ఎమ్మెల్యే సోమారపు పంతం

పెద్దపల్లి,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పంతం నెగ్గించుకున్నారు. రామగుండం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. దీంతో మేయర్‌ లక్ష్మీనారాయణ పదవికోల్పోయారు. అవిశ్వాసానికి మద్దతుగా 38 మంది కార్పేరేటర్లు ఓటు వేశారు. అవిశ్వాసానికి 28 మంది టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, 8 మంది కాంగ్రెస్‌, ఒక బీజేపీ కార్పొరేటర్‌ హాజరవగా, 17మంది కాంగ్రెస్‌ కార్పొరేటర్లు విప్‌ ధిక్కరించి ఎమ్మెల్యే సోమారపుతో కలిసి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. కాగా అవిశ్వాసానికి మేయర్‌ కొంకటి లక్ష్మినారాయణ, డిప్యూటీ మేయర్‌ శంకర్‌తో పాటు ఆరుగురు మేయర్‌ వర్గం కార్పొరేటర్లు, ముగ్గురు కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేటర్‌ గైర్హాజరయ్యారు. దీంతో గతంలో కెటిఆర్‌ బుజ్జగించినా చక్రం తిప్పిన సోమారపు అవిశ్వాసం గట్టెక్కేలా చేశారు. తదుపరి ఛైర్మన్‌ ఎవరన్నది ఇక సోమారపు చేతిలోనే ఉంది. ఇకపోతే అధికార పార్టీలో ఇన్నాళ్లూ నిరువుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా ‘అవిశ్వాసం’ పేరుతో బయటకు వస్తోంది. ఒకే పార్టీలోని నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఇతర పార్టీల మద్దతుతో తాడో పేడో తేల్చుకునేందుకు అధికార పార్టీలోని పలువురు నాయకులు సిద్ధమవుతున్నారు. అధికారపార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించి, అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకుంది. మేయర్‌గా కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్‌గా సాగంటి శంకర్‌లు ఎన్నికయ్యారు. కొంతకాలంగా మేయర్‌ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ మధ్య విభేదాలు తలెత్తాయి. కార్పొరేషన్‌లో కూడా కార్పొరేటర్లు ఇరువర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో గత నెల 6న పది మంది కాంగ్రెస్‌, ఒక బీజేపీ కార్పొరేటర్‌తో కలిపి మొత్తం 39 మంది కలెక్టర్‌కు మేయర్‌, డిప్యూటీ మేయర్‌లపై అవిశ్వాసం పెడుతూ కలెక్టర్‌కు నోటీస్‌ అందించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజేశ్వరిపై సొంత పార్టీ (టీఆర్‌ఎస్‌)కి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మాన నోటీసులు ఇచ్చారు. మంగళవారం 9 మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు నోటీకి నల్లబ్యాడ్జీలు ధరించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా నాలుగేళ్లపాటు పదవిలో కొనసాగిన సునీతారాణిని గ్దదె దించడమే లక్ష్యంగా 29 మంది సభ్యులు అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేయగా అవిశ్వాసపరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే సునీత మాత్రం బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. మొత్‌ంగా ఈ వ్యవహారాలు టిఆర్‌ఎస్‌కు పరీక్షగా మిగిలాయి.

———