పేదల అభ్యున్నతే తెరాస ప్రభుత్వ ధ్యేయం

– తెలంగాణలో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి
– గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నాం
– కల్లెడ గ్రామానికి వంద డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తాం
– తెరాస ఎంపీ కవిత
– కల్లెడలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కవిత
జగిత్యాల, జులై2(జ‌నం సాక్షి ) : పేదల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, వారిని అన్ని విధాల ఆదుకొనేందుకు అద్భుతమైన పథకాలను అమలు చేయటం జరుగుతుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లాలోని కల్లెడ గ్రామంలో కవిత
పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మసీదు, శ్మశాన వాటికతో పాటు అన్ని కుల సంఘాల భవనాల నిర్మాణాలకు ఆర్థికంగా సాయం అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌కు ఆడబిడ్డలంటే ప్రత్యేక ప్రేమ అని, అందుకే షాదీముబారక్‌, కల్యాణలక్ష్మీ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. కల్లెడ మహిళా సంఘం భవన నిర్మాణం పనులు వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని కవిత తెలిపారు. స్కూల్‌కు సంబంధించిన కంపౌండ్‌ వాల్‌ నిర్మాణం కొంచెం ఆలస్యమవుతుందని, త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు, పేదవారి కోసం సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ భోళా శంకరుడు అని కవిత వ్యాఖ్యానించారు. కల్లెడ గ్రామంలో 532 మంది రైతులకు రైతుబంధు చెక్కులు పంపిణీ చేశామన్నారు. రైతుబీమా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. కల్లెడ గ్రామానికి 100 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తున్నామని కవిత తెలిపారు.