పేద విద్యార్థులకు అధికారుల ఆసరా!
కాకినాడ, జూన్ 27 : ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఎ1 గ్రేడ్ సాధించిన 31 మంది పేద విద్యార్థులకు తూర్పు గోదావరి జిల్లా అధికారుల సంఘం ద్వారా 2000 రూపాయల నగదు ప్రోత్సాహం, బంగారు పతకం అందిస్తున్నామని సంఘం అధ్యక్షులు, అదనపు జాయింట్ కలెక్టర్ రామారావు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పేద విద్యార్థులకు ఆర్థిఖ సహాయం అందించాలని, పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేసే నెయిల్ కటర్ పంపిణీ మరో మారు చేపట్టాలని, హెచ్‌ఐవి, ఎయిడ్స్ ప్రభావిత చిన్నారుల కోసం సంఘ సభ్యులు చేపడుతున్న కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు. జిల్లా అధికారుల సంఘంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను కూడా సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఎ1 గ్రేడ్ సాధించిన ఎస్సీ విద్యార్థులందరికీ నగదు ప్రోత్సాహాన్ని అందిస్తామని పశు సంవర్థక శాఖ జెడి లివింగ్‌స్టన్ ప్రకటించారు. అలాగే ఎ1 గ్రేడ్ సాధించిన బిసి విద్యార్థులకు జిల్లా బిసి సంక్షేమాధికారి ధనరాజు, మత్య్సకార కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మత్య్సశాఖ డిడి కృష్ణమూర్తి ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. సమావేశానికి సంఘం ఆర్థిక సహాయంతో తీవ్ర నేత్ర వైకల్యం నుంచి విముక్తి పొందిన చిన్నారి, ఆమె బామ్మ హాజరై నూతన జీవితానిన అందించినందుకు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఆఫీస్ బేరర్ ఎస్సీ, కార్పోరేషన్ ఇడి మహీపాల్, ఖజానా శాఖ డిడి పాలేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.