పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో వరుణుడి బీభత్సం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఉమ్మడి మెదక్ జిల్లా అతలాకుతలమవటంతో పాటు పాతూరులో 20.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. దీంతో మెదక్ మండలంలో ఉన్న కుంటలు చెరువులు, వాగులు, రాయన్పల్లి ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.
రాజ్పల్లి 16.8, మెదక్ 13.4, హవేలీ ఘన్పూర్ మండలం నాగపూర్లో 12.9, వెల్దుర్తి మండలం దామరంచలో 12.5, కొల్చారం మండల కేంద్రంలో 11.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. రామాయంపేట్, మనోహరాబాద్ మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదయింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కూడవెల్లి వాగు వద్ద ఉన్న లోతట్టు వంతెనపై వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.