పోటెత్తిన ఆలయాలు!
కరీంనగర్, జూన్ 30: తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని కాళేశ్వరం, ముక్తేశ్వరాలయం, ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయాలు శనివారంనాడు భక్తులతో పోటెత్తాయి. లక్షలాది మంది భక్తులు గోదావరిలో పుణ్య స్నానమాచరించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరంలో తొలి పండుగతో నిత్య పండుగలు ప్రారంభ మవుతాయని చెప్పారు. తెల్లవారుజామున 3 గంటలకే వైష్ణవాలయాలు, శివాలయాలు, గణపతి ఆలయాల్లో పంచామృతాలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సుమారు 50వేల మంది భక్తులు అమ్మవారిని దర్శిం చుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడెలును మొక్కుబడులుగా భక్తులు సమర్పించుకున్నారు. ఆలయాలన్నీ మామిడి తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల గోవింద నామస్మరణంతో విష్ణు సహస్ర నామ పారాయణంతో ఆలయాలు మార్మోగాయి. నేటి ఏకాదశిని శయన ఏకాదశిగా పిలుస్తారు. విష్ణుమూర్తి నేటి నుంచి నాలుగు నెలల పాటు శయన భంగిమలో దర్శనమిస్తారు. అందుకే నేటి పండుగను శయన ఏకాదశి అని కూడా అంటారు. భక్తులు నేడు ఉపవాస దీక్షలో పాల్గొని మరునాడు ద్వాదశినాడు అన్న ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇదిలా ఉండగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మాలాధరులతో పోటెత్తింది. భక్తులు ఆంజనేయస్వామి స్తోత్రంతో, సంకీర్తనతో స్వామిని దర్శించుకున్నారు. ఎక్కడ చూసినా భక్తుల సందోహంతో కోలాహలంగా మారాయి. ఆలయాల్లో భక్తులకు ప్రసాదంగా కొబ్బరిముక్కలు, అటుకులు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని అందజేశారు.