పోలవరం డిజైన్‌ను మార్చం
నేదునూరు, శంకర్‌పల్లి గ్యాస్ కోసం ఉత్తరాలు రాశాం : సీఎం కిరణ్
ఖమ్మం, ఆగస్టు 10 :ఖమ్మంలో స్టీల్‌ప్లాంట్ బ్రాంచి కోసం కమిటీని వేశామని.. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ బాట బుధవారంనాడు ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఇందిరమ్మ బాట ముగింపు సందర్భంగా జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోచంపాడు ఫేజ్-7కు, సత్తుపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలకు త్వరలోనే కేంద్రం అనుమతి సాధిస్తామని చెప్పారు. గిరిజన పాఠశాలల్లో 2700 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 600 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా అందిస్తామని చెప్పారు. వైద్య సేవలపై క్రమశిక్షణా చర్యలు అమలు చేస్తామని తెలిపారు. మైనింగ్, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రులలో డ్రగ్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నామని, శ్రీకాకుళం, ఆదిలాబాద్, చిత్తూరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టామని తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్ స్టోరు భవనాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను మీడియా తెలియజేస్తే సరిజేసు కుంటామని చెప్పారు. తమకు ఎలాంటి భేషజం ఉండబోదన్నారు. ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని తెలిపారు. పొరపాట్లను తప్పనిసరిగా సరిదిద్దుకుంటామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని కరువు ప్రాంతాలరైతులకు మేలు చేకూరుతుందన్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 4వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాక డిజైన్‌లో మార్పులు అంటే సాధ్యం కాదన్నారు. పోలవరం వల్ల రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల వారికి 45 టిఎంసిల నీరు అందుతుందని చెప్పారు. దీంతో కొన్ని లక్షల ఎకరాలు అదనంగా సేద్యం కిందకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల జూన్ మొదటి వారంలోనే పొలాలకు నీరు అందుతుందని, తద్వారా పంట అక్టోబరు నెలాఖరులోగా ఇళ్లకు చేరుతుందని చెప్పారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుతున్నానన్నారు. పోలవరం వల్ల భూములు కోల్పోయే గిరిజనులకు న్యాయం చేకూరుస్తామన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఏ ఒక్కరూ కూడా నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్యాకేజీలను వర్తింపజేస్తామన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇప్పటివరకు గోదావరి నది నుంచి 400 టిఎంసిల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందన్నారు. నేదునూరు, శంకరపట్నం గ్యాస్ కోసం ఇప్పటివరకు కేంద్రానికి నాలుగైదుసార్లు లేఖలు రాశానని, ఇటీవల వెళ్లినప్పుడు మరోమారు గుర్తు చేశానని చెప్పారు. ఈ విషయాలన్నీ తెలీక టిఆర్‌ఎస్ వాళ్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మంత్రులు రాంరెడ్డి వెంకటరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.