ప్రజలకు అందుబాటులో బియ్యం ధరలు
ఎజెసి రామారావు
కాకినాడ,జూలై10 : సామాన్య ప్రజానికానికి బియ్యం ధరలు అందుబాటులో ఉండేలా రైస్ మిల్లర్స్ తమ పూర్తి సహాయ, సహకారాలు అందించాలని ఎజెసి బి రామారావు కోరారు. డ్వామా సమావేశ హాలులో రైస్ మిల్లర్స్‌తో బియ్యం ధరలపై ఎజెసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ కమీషనర్ నిర్ణయించిన ధరకు బిపిటి బియ్యాన్ని అమ్మాలన్నారు. గతంలో రైతు బజార్‌లో, రైసు మిల్లుల దగ్గర పాయింట్లు పెట్టి అమ్మడం జరిగిందని, అదే విధంగా ఇప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో అవసరమైన స్టాకును అందుబాటులో పెట్టాలన్నారు. ఇందుకు మిల్లర్లు పూర్తి సహాయ, సహకారాలు అందించాలని ఎజెసి కోరారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరెడ్డి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ కమీషనర్ బిపిటి రూ.29 ధర నిర్ణయించారని, ఆ మేరకు అమ్మేందుకు ప్రయత్నిస్తామన్నారు. మిల్లుల వద్ద బిపిటి రూ.29 అమ్మగలమని, మిగిలిన పాయింట్లలో రవాణా ఛార్జీలు భరించడం కష్టమన్నారు. ధాన్యం స్టాకు మిల్లర్ల వద్ద లేదని, అధిక ధరకు బయట ప్రాంతాల నుండి తెచ్చి, తక్కువ రేటుకు అమ్మకాలు జరపడం కష్టమన్నారు.