ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం

– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
– కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రులు
కరీంనగర్‌, మే28(జ‌నం సాక్షి ) : తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కరీంగనర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వెల్‌నెస్‌ సెంటర్‌, డయాలసిస్‌ సెంటర్‌ను మంత్రులు ఈటల రాజేందర్‌, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయుష్‌ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 40 సింగిల్‌ యూజ్‌ డిస్పోజల్‌ డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాష్ట్రమంతా 1500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్టాన్రికి 5 ఆయుష్‌ కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. వెల్‌నెస్‌ సెంటర్లలోని చిన్నచిన్న లోపాలను సవరిస్తామన్నారు. పాత జిల్లాల కేంద్రాల్లో కూడా వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మారెడ్డి వెల్లడించారు నాలుగేళ్లలో వైద్య రంగంలో అనుహ్యమార్పులు తీసుకువచ్చామన్నారు. అనంతరం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. జిల్లాకు 750 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నామన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈకార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.