ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యం: కలెక్టర్‌

రాజన్న సిరిసిల్ల,జూలై2(జ‌నం సాక్షి):ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. మొత్తంగా 196 దరఖాస్తులు రాగా రెండు పడకల గదులకు సంబంధించి 55, రెవెన్యూకు 89, పింఛన్లు, ఇతర దరఖాస్తులు కలిపి 52 వచ్చాయి. ఖడయల్‌ యువర్‌ కలెక్టర్‌’కు 3 ఫోన్‌కాల్‌ ఫిర్యాదులు అందాయి. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిని ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని వేదికగా భావించాలని, ప్రతి అర్జీపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హమైన ప్రతిఫిర్యాదుకు పరిష్కారం చూపాలన్నారు. ప్రజా సమస్యలను సులభంగా స్వీకరించేందుకు జిల్లాలో జనహితను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రజావాణితో పాటు జనహిత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. హరితహారం కింద ఇప్పటివరకు నాటిన మొక్కల సంరక్షణకు కృషి చేయాలనిపేర్కొన్నారు. ట్విట్టర్‌ ఫిర్యాదుల పట్ల జిల్లా అధికారుల ఉదాసీనతపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులందరూ ట్విట్టర్‌ ఖాతాను ప్రారంభించి ఫిర్యాదులను తక్షణమే స్వీకరించాలని తెలిపారు. ప్రజావాణి, జనహిత పెండింగ్‌ లక్ష్యాన్ని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆధికారులను ఆదేశించారు. జేసీ యాస్మిన్‌బాషా, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.