ప్రణబ్‌కు ఆత్మీయ వీడ్కోలు

5

– ముగిసిన పదిరోజుల విడిది

– హకీంపేటలో సాగనంపిన గవర్నర్‌, సీఎం కేసీఆర్‌,మంత్రులు

హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి):

హైదరాబాద్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వర్షాకాల విడిది ముగిసింది. పది రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి బుధవారం ప్రత్యేక సైనిక విమానంలో హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూలబొకేలు ఇచ్చి రాష్ట్రపతికి వీడ్కొలు పలికారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతికి పాదాభివందనం చేసి ఆత్మీయతను చాటుకున్నారు. గత నెల 29న హైదరాబాద్‌ వచ్చిన ప్రణబ్‌…. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. తన పర్యటనలో తిరుమల, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాలను సందర్శించారు. విడిది ముగించుకుని హకీంపేట విమానాశ్రయం నుంచి దిల్లీ బయలుదేరిన రాష్ట్రపతికి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌లతో పాటు, తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి, మండలి లద్ఘిర్మన్‌ స్వామి/-నడ్‌, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, తదితరులు వీడ్కోలు పలికారు. ఏటా శీతాకాల విడిదికి హైదరాబాద్‌ రావడం ఆనవాయితీ. కానీ ఈ సారి వర్షాకాల విడిదికి రాష్ట్రపతి వచ్చారు. దాదాపుపదిరోజులు ఇక్కడ ఉండి ఆయన బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు.

ప్రతి ఏడాది శీతాకాలంలో విడిదికి విచ్చేసే రాష్ట్రపతి ఈసారి వర్షాకాలంలోనే వచ్చారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడి నేతలు సమస్యలతో స్వాగతం పలికారు. రాష్ట్రపతిని కలిసిన అనేక మంది నేతలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇక రాష్ట్రపతి రాకతో  బొల్లారంలో రాష్ట్రపతి భవన్‌ పది రోజులపాటు కళకళలాడింది. విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జూన్‌ 29న నగరానికి విచ్చేశారు. ప్రణబ్‌ ముఖర్జీకి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు.రాష్ట్రపతి ప్రణబ్‌ రాక సందర్బంగా గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరు కావాల్సి ఉన్నప్పటికి.. జ్వరం కారణంగా హాజరు కాలేకపోయారు. ఇక రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు వచ్చిన ప్రణబ్‌కు అర్చకులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ప్రణబ్‌కు తీర్ధప్రసాదాలు అందించారు. అదేవిధంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని రాష్ట్రపతి ప్రణబ్‌ దర్శించుకున్నారు. ప్రణబ్‌తో పాటు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు రచించిన ఉనికి పుస్తకాన్ని రాష్ట్రపతి ఆవిస్కరించి తొలి పుస్తకాన్ని స్వీకరించారు. ఇక రాష్ట్రంలోని సమస్యలపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని పలువురు నేతలు కలిసి వివిధ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా ఓటుకు నోటు వ్యవహారంపై ప్రణబ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలోని సమస్యలను దాదా దృష్టికి తీసుకెళ్లినట్లు వైసీపీ నేతలు తెలిపారు. అదేవిధంగా ప్రణబ్‌ముఖర్జీని తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజాపరిస్థితులపై ఆయనకు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని నేతలు ప్రణబ్‌ను కోరారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని తెలంగాణ మండలాలు ఏపీలో కలిశాయని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రాష్ట్రపతిని కలిసి విన్నవించారు. తన నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఏపీలో కలిశాయని.. అందుకు తనకు ఏపీ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం కూడా కల్పించాలని కోరారు.  ఏపీ కాంగ్రెస్‌ నేతలు, ఏపీ మంత్రులు కూడా విడివిడిగా కలిశారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా అనేకమంది ప్రముఖులు కూడా ప్రణబ్‌ను కలిసినవారిలో ఉన్నారు. చివరి రోజు మంగళవారం రాష్ట్రపతి నిలయంలో హైటీ ఆఫర్‌ చేశారు. దీనికి గవర్నర్‌ నరసింహన్‌, సిఎం కెసిఆర్‌ తదితరులు హాజరయ్యారు. మొత్తానికి నగరంలో దాదాపు 10 రోజులు గడిపిన ప్రణబ్‌ ముఖర్జీ.. వర్షాకాల విడిది ముగించుకుని ఢిల్లీకి వెళ్లారు.