ప్రతిష్టాత్మకంగా కరీంనగర్‌ సభ

సభా బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి ఈటెల
లక్షమంది రైతులను తరలించేందుకు ఏర్పాట్లు
కరీంనగర్‌,మే9(జ‌నం సాక్షి): రైతుబందు పథకానికి సాక్షీభూతంగా నిలిచే చారిత్రక సభ నిర్వహణకు కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఇందిరానగర్‌ సర్వం సిద్ధమైంది. రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడి నుంచే పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సభకు లక్షమందికి పైగా రైతులు తరలివస్తారని అంచనా. ఈ మేరకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ సారథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 10న నిర్వహించే రైతుబంధు సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ అన్నదాతల
సంక్షేమాన్ని పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కర్షకుల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదన్నారు. రైతుబంధు పథకం భావితరాలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నని చెప్పారు. ఈ చారిత్రక కార్యక్రమం ఆరంభానికి కరీంనగర్‌ జిల్లా వేదిక కావడం సంతోషంగా ఉన్నదని మంత్రి చెప్పారు. చారిత్రకసభను అనుకున్న దానికంటే ఎక్కువగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉన్నదన్నారు. గత ప్రభుత్వాలు లక్షల కోట్లు వెచ్చించామని చెప్పినా అన్నదాతల జీవితాల్లో మార్పు రాలేదని, అప్పులు కట్టలేక ఆత్మహత్యలే కొనసాగాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతన్నలకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల కరంట్‌ ఇస్తున్నామని, ఏండ్లుగా రైతులకు చిక్కులు తెస్తున్న భూరికార్డులను ప్రక్షాళన చేశామని చెప్పారు. కొత్త రాష్ట్రం ఇంత త్వరగా అభివృద్ధి చెందడమేమిటని ప్రతి ఒక్కరూ చర్చించుకునే స్థాయికి తెలంగాణ చేరుకున్నదని కొనియాడారు. మరోవైపు అధికారులు కూడా తమవంతుగా ఏర్పాట్లను పూర్తి చేసి భద్రతాపరమైన లోటుపాట్లు లేకుండా చూస్తున్నారు.  మంత్రి ఈటల రాజేందర్‌ ఒకవైపు సభాఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే.. మరోవైపు గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నలమూలల నుంచి వచ్చే రైతుల కోసం 1600 బస్సులను ఏర్పాటుచేయాలని అదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు, సమన్వయసమితి సభ్యులు ఆయా గ్రామాల వీఆర్వోలు, వీఆర్‌ఏల సమన్వయంతో రైతులను జాగ్రత్తగా తీసుకొచ్చి తిరిగి గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. బస్సుల్లో రైతులకు అల్పాహారం, మజ్జిగ, వాటర్‌ ప్యాకెట్లు అందించాలని చెప్పారు.  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నేతృత్వంలో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికేందుకు వెయ్యిడప్పులు, వెయ్యిమంది ఒగ్గు , కోలాట కళాకారులను సిద్ధంచేశారు.
——