ప్రభుత్వంపై మళ్లీ పట్టుసాధించిన లిక్కర్ సిండికేట్
నెల్లూరు, జూన్ 27 : జిల్లాలో 348 మద్యం షాపులకు లైసెన్సులు కేటాయింపులో మళ్లీ లిక్కర్ సిండికేట్లే తమ ఆదిపత్యాన్ని చాటుకున్నారు. మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లకు విక్రయించే నేపథ్యంలో ప్రభుత్వం జనాభప్రతిపాదికన మద్యం లైసెన్సుల లాటరీ పద్ధతి ద్వారా మంగళవారం నాడు నిర్వహించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. జిల్లా మొత్తం మీద 348 మద్యం దుకాణాలకు గాను 3,983 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ పద్ధతిలో కేటాయింపు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగా తొలుత పోటీ లేని 36 దుకాణాలకు ఏకగ్రీవంగా లైస్సెసులు జారీ చేశారు. అలాగే 26 దుకాణాలకు అసలు దరఖాస్తులే రాకపోవడం వల్ల ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తే వాటి విషయం ఆలోచించవచ్చునని వాటిని పక్కపెట్టవచ్చునని ఆలోచించారు. మిగితా 322 షాపులకు గాను ఇప్పటివరకు ప్రభుత్వానికి 9 కోట్ల 96 లక్షలు ఆదాయం వచ్చింది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ప్రభుత్వానికి కొంతమేర నష్టం వాటెల్లిందనే చెప్పాలి. గత ఏడాది సుమారు 13 కోట్లు రాబడి రాగ ఈ ఏడాది అది 9 కోట్ల 96 లక్షలకు పడిపోయింది. ప్రస్తుత జరిగిన లాటరీ పద్ధతిని విశ్లేషిస్తే చాలా చోట్ల మద్యం సిండికేట్లు ప్రభుత్వంపై మళ్లీ తన పెత్తనాన్ని చాటుకున్నారనే చెప్పవచ్చు జిల్లాలో 26 దుకాణాలకు అసలు దరఖాస్తులు రాకపోవడం, 36 చోట్ల ఒక్కొక్క షాపుకు ఒకే ఒక దరఖాస్తు రాకపోవడంతో పోటీ లేకుండా 36 చోట్ల ప్రభుత్వం ఏకగ్రీవంగా లైసెన్సులను జారీ చేయాల్సి వచ్చింది. దీన్ని బట్టి మద్యం సిండికేట్లే కూడగలపుకుని ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారనేది స్పష్ట్టం కాగా నెల్లూరు నగరంలో అయ్యప్ప గుడి సెంటర్‌లోని ఓ మద్యం షాపుకు 246 దరఖాస్తులు వచ్చాయి. ఈ షాపుల్లో రోజుకు 3 లక్షల మద్యం వ్యాపారం జరుగుతోంది. అలాగే నెల్లూరు నగరంలోని సెట్టిగుంట రోడ్డులో గల ఓ మద్యం షాపులకు 92 దరఖాస్తులు వచ్చాయి. ఈ షాపులో రోజుకు 3 లక్షల 50 వేలు మద్యం వ్యాపారం సాగుతోంది. అలాగే ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లో మద్యం షాపుకు 140 దరఖాస్తులు రాగా అందులో రోజుకు 2 లక్షల 50 వేలు వ్యాపారం జరుగుతోంది. వీటన్నీంటిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయగా జిల్లాలో అత్యధికంగా వ్యాపారం జరిగే నారాయణరెడ్డిపేటలోగల మద్యం షాపుకు 150 మంది దరఖాస్తు చేసుకున్నారు. రోజుకు ఇక్కడ 4 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ప్రభుత్వం లాటరీ పద్ధతి వల్ల ఒక్కొక్క షాపుకు లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించిన మద్యం దుకాణాల మంజూరు చాలా మంది మద్యం వ్యాపారులను కొంత మేర నష్టం పరిచిందనే చెప్పాలి. మద్యం లైసెన్సుల పొందగోరే వారు 25 వేలు తిరిగి ఇవ్వని డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఇలా 3,983 మంది డిపాజిట్లు చెల్లించగా వారిలో 322 మంది మాత్రమే షాపులు లభించాయి. అంటే మిగితా వారంతా తాము చెల్లించిన డిపాజట్లు కోల్పోయారనే చెప్పాలి. లెక్కన ప్రభుత్వానికి ఒక డిపాజిట్ల రూపంలోనే 9 కోట్ల 96 లక్షలు ఆదాయం వచ్చింది. ప్రస్తుత లాటరీ పద్ధతిలో మంజూరు చేసిన లైసెన్సులను పరిశీలిస్తే మళ్లీ మద్యం సిండికేట్లు గ్రామాలలో విచ్చిలవిడిగా బెల్టుషాపులను నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది పరోక్షంగా గ్రామాలల్లో మద్యాన్ని ఎరులై పారించే అవకాశాలు ఉన్నాయి. కాగా దరఖాస్తులు రాని 26 దుకాణాలకు నేడో రేపో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయవచ్చునని అధికారులు భావిస్తున్నారు.