ప్రభుత్వానికి పట్టని కౌలు రైతుల ఆత్మహత్యలు
ప్రపంచీకరణ విధానాలు కార్పొరేట్ వ్యవసాయీ కరణలో అన్నదాతల పరిస్థితి మదింత దయనీయంగా మారింది. ఒకప్పుడు పదిమందికి అన్నం పెట్టిన రైతన్నకు నేడు మెతుకు దొరకడమే గగనమయింది. భూములను కోల్పోయిన రైతు నేడు కూలీగా మారాడు. వర్షభావ పరిస్థితి, కరువు, కటిక దారిద్య్రం, సేద్యానికి నీరు లేకపోవడం, మరోవైపు కరెంటు కోతలతో వేసిన పంటలు చేతికిరాక, పెట్టిన పెట్టుబడులు రాక, రైతులకు చివరకు మిగిలేది ఉరితాడు, ఆకలి చావులే. మట్టిని నమ్ముకున్న అన్నదాత చివరికి మట్టిలోనే కలిసిపోతున్నాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా అన్నదాతలకు అకలి చావులు, ఆత్మహత్యలు తప్పడంలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు 3 లక్షల 25 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 35 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత 5 నెలల కాలంలో కౌలు రైతులు 250 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో కౌలు రైతులంటే భూమి లేని రైతులు తమ జీవితాలు ఏదో ఒక విధంగా బాగుపడతాయని, గంపెడు ఆశతో భూమిని కౌలుకు తీసుకుని చివరకు ఆ భూమిలోనే ప్రాణాలు వదులుతున్నారు. వ్యవసాయం కార్పొరేట్ వైపు పరుగెత్తడంతో ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారు. కౌలు రైతులు సేద్యానికి పెట్టిన ఖర్చులు తిరిగి రాకుండా మరింత అప్పుల ఊబిలో కురుకుపోయి చేసిన అప్పులు తీర్చలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ధరులు విపరీతంగా పెరిగాయి, పెట్టుబడులు ఎక్కువయ్యాయి, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన అధికారులు చలించరు బ్యాంకు రుణాలు అందవు. గత ఐదేండ్లుగా ప్రకృతి వైపరిత్యాలు కౌలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. పత్తి, వరి, మక్క, కూరగాయ పంటలు, ప్రొద్దుతిరుగుడు పంటలు సాగు చేసే కౌలు రైతులు యజమానికి ఎకరాకు 15 నుంచి 20 వేల రూపాయల వరకు కౌలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది కౌలు రైతులున్నారు. వ్యవసాయంలో అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకోసం 2007లో ప్రభుత్వం ఓ జీవోను అమలు చేసింది. ఈ జీవో ప్రకారం ఆర్డివో, డిఎస్పీ తదితరులతో కమిటీ ఏర్పాటు చేసి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి లక్ష రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్ చేయడంతో పాటు, రుణాలు ఇచ్చిన వారిదతో మాట్లాడి వారికి 50 వేల రూపాయలు చెల్లించాలి ఇది ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. రైతులు నిజంగా ఆత్మహత్యలు చేసుకున్న వ్యవసాయానికి సంబంధం లేదంటూ తిరస్కరిస్తున్నారు. దీంతో రాను రానూ రైతు అనే వాడు కనుమరుగైపోతాడు. ఎవరూ వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం లేదు. రానున్న మరో పది సంవత్సరాల కాలంలో వ్యవసాయం ఉంటుందా, ఉండదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.కౌలు రైతులు మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గోండ, రంగారెడ్డి, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆత్మహత్యలు మితిమీరిపోతున్నాయి. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు రైతులను చిన్నచూపు చూస్తున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విపలమయ్యాయి. దేశానికి వెన్నుముకయిన రైతును ఆదుకోవడంలో అలసత్వం వహిస్తే ప్రభుత్వాలు కూలిపోక తప్పదు. కౌలు రైతులు వారి భార్యల పుస్తేలు, మట్టేలు, బంగారం ఏది ఉంటే అది అమ్మి వ్యవసాయం చేసినా ఏమి మిగలడం లేదు. రైతు బడ్జేట్‌లో 5,500 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించిచామని నాలుగు శాతానికి మాత్రమే వడ్డీలు ఇస్తున్నామని, ఈ వడ్డీ కూడా కట్టవద్దని ప్రభుత్వమే చూసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పినప్పటికి, 95 లక్షల మంది రైతులకు లక్షరూపాయలలోపు రుణాలిచ్చామని ఉదరగొడుతున్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న పాలకుల ప్రభుత్వంలో అన్నపూర్ణ దేశంలో కౌలు రైతుల, అన్నదాతల ఆత్మహత్యలు, ఆకలి చావుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2011లో కౌలు రైతులకు రుణాఇచ్చేందుకు ప్రత్యే చట్టాన్ని రూపొందించినప్పటికి బ్యాంకులు మాత్రం ఋణాలిచ్చేందుకు ముందుకు రాకపోవడంతో కౌలురైతుల పరిస్థితి నడి సముద్రంలో నావలా తమారైంది. కౌలు రైతులకుభూ యజమానులకు కౌలు రైతుల చట్టం పై అవగాహన కల్పించాలి. కౌలు రైతులకు బడ్జెట్‌లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం 2001లో వ్యవసాయ కూలీల సంఖ్య కోటి 38 లక్షల 32 వేలు ఉండా నేడ కోటి 69 లక్షల 67 వేల మంది పెరిగారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వాలు అమలు చేసినట్లయితే రైతుల కష్టాలు కొంతమేరు తొలగిపోతాయి. కంపెనీ సైద్యం వస్తే రైతు తన భూమిపై హక్కు కోల్పోవడమే కాకుండా తన భూమిలో తనే కూలీవాడిగా పనిని చేయకతప్పదు. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షభాన్ని ఎదుర్కోంటుంది. వ్యవసాయ పరంగా ఆదాయం తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో అహార భద్రత సమస్యలు తలెత్తున్నాయి. ఖర్చులకు భయపడి వ్యవసాయానికి దూరంగా ఉంటూ దూర ప్రాంతాలకు వలసలు వెలుతున్నారు. రియల్ ఎస్టేట్ మాయలో పచ్చని పొలాలు బీడులుగా మారుతున్నాయి. రైతు రాజ్యం నినాదంతో గెలిచిన పాలకులు రైతుకు వ్యతిరేకంగా మారి అన్నదాతల నడ్డి విరుస్తున్నారు. ప్రయివేటు పరిశ్రమలు ప్రత్యేక ఆర్థిక మండళ్లు భూసేకరణ కరువు కోరలకు చిక్కుకున్న అన్నదాతలు వ్యవసాయానికి దూరమై ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కరెంటు కోతలు రైతుల పాలిట శాపాలుగా మారాయి. ఉపాధి హామీ పనులను రైతాంగం పనులతో అనుసంధానం చేయడంతో రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పటికీ ఇది ఎంత వరకు రైతులకు ఆపయోగపడుతుందో వేచి చూడాల్సిందే. దేవాదాయ ధర్మాదాయ కౌలు దార్లకు రుణ ఖర్చులు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది. పత్తి రైతులకు మన్సెంటో కంపెనీ చేస్తున్న దోపిడీని యజామాన్యం యుపిఎ ప్రభుత్వాన్ని ప్రలోభపరుస్తున్నారు. బిటి విత్తనాలకు వ్యతిరేకంగా కౌలు రైతుల రక్షణ చట్టం చేయాలి. వ్యవసాయ రంగాన్ని రక్షించే చిన్న సన్న కారు రైతాంగాన్ని ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలి. లేకపోతే కౌలు రైతులు మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదముంది. దీనిని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.
– దామరపల్లి నర్సింహారెడ్డి