ప్రభుత్వాస్పత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు

– జనరిక్‌ మందుల దుకాణం ఏర్పాటు
కరీంనగర్‌, జూన్‌ 27 : కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు. 300 పడకలున్నా ఆ ఆసుపత్రి రోగులకు వైద్య సహాయం. చికిత్స అందించటంలో ముందు నిలిపేదుకు చర్యలు తీసుకొంటున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జన ఔషధి జనరిక్‌ మెడికల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేసి రోగులకు చౌవకగా మందులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ముఖ్యమంగా కరీంనగర్‌లో వివిధ వ్యాధుల నిమిత్తం మందులు వాడే రోగులకు అత్యంత చౌవకగా నాణ్యతగల ఫలితం ఇచ్చే జనఔషధ మందులను ప్రజల ముంగిట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జనరల్‌ మెడికల్‌ స్టోర్‌ ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ మందుల ధరలో 75 శాతం వరకూ తగ్గింపు ధరపై అనగా అత్యంత తక్కువ ధరకే జనరిక్‌ మందులు లభిస్తాయని అంతేకాకుండా నాణ్యత కలిగి సాధారణ మందులు ఇచ్చే ఫలితాన్ని జనరిక్‌ మందులు కూడా ఇస్తాయి. కాకపోతే రోగులు జనరిక్‌ మెడిసిన్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వీటి వాడకం వైపు మొగ్గు చూపి ప్రయోజనం పొందేందుకు అటు డాక్టర్లు, ఇటు పేషంట్లు, సహకరించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో ఈ మెడికల్‌ స్టోర్‌ను ఇందిరాక్రాంతి పథం (ఐకెపి) జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఎ) ద్వారా ఏర్పాటు చేయటం జరుగుతుంది. జనరిక్‌ మెడికల్‌ స్టోర్‌ ఏర్పాటుకు లైసెన్స్‌ పొందటం జరిగింది. ఈ లైసెన్స్‌ను డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మిస్టేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జారీ చేశారు. ఈ లైసెన్స్‌ మార్చి21, 2012 నుంచి 2017 మార్చి 20 వరకూ ఉంటుంది. రాజీవ్‌ యువకిరణాల జాబ్‌ మేళా సందర్భంగా ఫార్మసిస్ట్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే 81వేల రూపాయలకు పైగా జనరిక్‌ మందులను విశాఖపట్నం జిల్లా సమాఖ్యకు చెందిన జీవనధార ఫార్మసీ నుంచి తెప్పించారు. స్టోర్‌ ఏర్పాటుకు అనువైన సామాగ్రి, పరికరాలు సమకూర్చు కోవటం జరిగింది. ఇందుకొరకు ఆసుపత్రి అభివృద్ధి, నిధుల నుంచి 2.50 లక్షల రూపాయలు వెచ్చించనున్నారు. కరీంనగర్‌ (2) ప్రభుత్వాసుపత్రిలో జనరిక్‌ మందుల స్టోర్‌తో పాటు ఆయుష్‌ డిపార్ట్‌ మెంట్‌కు సంబంధించిన 20 పడకల, వార్డును 10 లక్షల రూపాయలతో నెలకొల్పాలని నిర్ణయించారు. ఇందులో ఆయుష్‌కు చెందిన ఆయుర్వేద, యునాని, యోగా, సిద్ద, హోమియోపతికి చెందిన రోగులకు చికిత్స అందజేస్తారు. ప్రస్తుతం అవుట్‌ పేషంట్‌ విభాగంగా వైద్య సేవలందుతున్నాయి. వార్డు నెలకొల్పిన అనంతరం ఇన్‌పేషంట్లు కూడా చికిత్స తీసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న పోస్ట్‌ మార్టం మార్చురీని ఆసుపత్రి ఆవరణలోని మరో చోటుకు తరలించి 5లక్షల రూపాయలతో ప్రత్యేక గది, కంపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతమున్న మార్చురీ వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారనే దృష్ట్యా ఈ చర్య తీసుకొంటున్నారు. అలాగే 20లక్షల రూపాయలతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ప్రత్యేక వార్డు, నవజాత శిశువులకు ప్రత్యేక వార్డు, ఐసియు, న్యూట్రిషనల్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆసుపత్రి వెనుక భాగంగా మాజీ సైనికులకు వైద్య సేవలించేందుకు పాలీక్లినిక్‌ను ఏర్పాటు చేయటం జరుగుతోంది. ఇందులో ఆర్మీకి చెందిన డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందిస్తారు. కరీంనగర్‌ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్‌ తన ఎంపి కోటా నుంచి మంజూరు చేసిన 13లక్షల రూపాయలతో సి-ఆర్మ్‌మెషన్‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆసుపత్రి భవనానికి రంగులు వేయటంతో పాటు పార్కింగ్‌ షెడ్‌, ఆసుపత్రి లేఔట్‌ మ్యాప్‌ ప్రదర్శన బోర్డు, లెడ్‌ సైన్‌ డిస్‌ప్లే బోర్డు, లాండ్‌ స్కేపింగ్‌ చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలో గైనకాలజిస్టుల కొరత డాక్టర్లను కూడా నియామకం చేస్తున్నారు. ఈ చర్యలతో సరికొత్త శోభను సంతరించుకొని ప్రభుత్వాసుపత్రి ద్వారా రోగులకు మెరుగై వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని, ప్రజలు, రోగులు వీటిని వినియోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమాత్యులు శ్రీధర్‌బాబు, కలెక్టర్‌ స్మిత సబర్వాల్‌ ఆశాభావం వ్యక్తం
చేశారు.