ప్రభుత్వ భూములకు కంచె
రంగారెడ్డి,జూన్20(జనంసాక్షి): వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటి రక్షణకు కంచెలు ఏర్పాటు చేయాలని అధికారుల ఆదేశించారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా చూసే బాధ్యత రెవెన్యూ అధికారులదేనని, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ప్రభుత్వ భూముల వద్ద అవసరమైతే బోర్డులు పాతాలన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.తహసీల్దార్లు మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉండి రెవెన్యూ పరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల పరిధిలో ఉన్న అసైన్డ్, మిగులు, ఇతర భూములు, వివిధ సంస్థలకు కేటాయించిన భూముల వివరాలతో నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణ మండలాల్లో ఎలాంటి వివాదాలులేని భూములకు కంచె వేయాలన్నారు. డివిజన్, మండల స్థాయిలో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని, ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, వసతిగృహాలు, ఇతర ప్రభుత్వ సంస్థలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.