ప్రభుత్వ విధానాలతో రైతులు చితికిపోతున్నారు : చంద్రబాబు నాయుడు
రంగారెడ్డి : రైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనేనాథుడే లేడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో కరెంటు కోతలున్నాయని, ఒక ఇంటికి రూ.7 వేలు బిల్లు వేస్తే పేదలు ఎలా కడతారని ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శుక్రవారం ఉదయం వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలోని సల్కలూరు నుంచి 35వ రోజు యాత్రను ప్రారంభించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరెంటు రాదు.. బిల్లు భారం మాత్రం పెరిగిందని అన్నారు. పిల్ల కాంగ్రెస్‌లో ఒకరు జైలులో ఉంటే ఇంకొకరు పాదయాత్ర చేస్తున్నారని, మరొకరు ఎమ్మెల్యేలను దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్ దొంగాట ఆడుతోందని చంద్రబాబు విమర్శించారు. పార్టీలు కాంగ్రెస్‌లో కలిసిపోయేవే అని, ప్రజల కోసం మిగిలేది తెలుగుదేశం పార్టీ ఒకటేనని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని పనికిమాలిన ప్రభుత్వం పాలిస్తోందని అన్నారు. పేదలకు దక్కాల్సిన సొమ్మును కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌నుఅవినీతి, కుంభకోణాలకు రాజధానిలా మార్చారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామనే అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు. రాబోయే కాలంలోతెదేపా ఒక్కటే ప్రజల పక్షాన నిలుస్తుందని పేర్కొన్నారు. దారిపొడవునా మహిళలు బాబుకు బ్రహ్మరథం పట్టారు.