ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు

బోర్ల కింద కూడా వరి సాగుకే మొగ్గు
కామారెడ్డి,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఈ యాసంగిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4,02,200 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు 1,15,823 ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో వరి 1,99,774 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 800లకు పైగా ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. శనగ 99,992 ఎకరాలకు గాను 79,246 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 19,240 ఎకరాలకు గాను 15,024 ఎకరాల్లో సాగు చేశారు. జొన్న 20,756 ఎకరాలకు గాను 15,533 ఎకరాల్లో సాగు చేశారు. ఈ పంటలతో పాటు మినుములు, పెసర్లు లాంటి పంటలను సైతం రైతులు సాగు చేస్తున్నారు. గత యాసంగిలో జిల్లాలో 2.47లక్షల ఎకరాల్లో వరి సాగయింది. వానాకాలంలో 2.70లక్షల ఎకరాల్లో వరి వేశారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో జిల్లాలో 31,027 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టుకు నీటి విడుదల చేసేందుకు నిర్ణయించారు. పోచారం ప్రాజెక్టు కింద 10వేల ఆయకట్టు ఉంది. జనవరి నుంచి నీటి విడుదల చేయనున్నారు. కౌలాస్‌ ప్రాజెక్టు కింద 9వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కింద నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు, చెరువుల్లో నీరు ఉండడంతో కాలువల కింద ఇప్పటికే తడి ఆరలేదు. మరో 10 రోజుల్లో నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో వరికి బదులు వేరే పంటలు సాగుచేయడం సాధ్యం కాదని రైతులు అంటున్నారు. బాన్సువాడ, బీర్కూర్‌, నస్రూల్లాబాద్‌, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, జుక్కల్‌ మండలాల్లో ఆయా ప్రాజెక్టుల కింద వరి ఎక్కువగా సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు జిల్లాలో 28,022 వ్యవసాయ బోరుబావులు ఉన్నాయి. ఈ బోర్ల కింద కూడా వరినార్లు పోసి ఉంచారు. ఈ యాసంగిలో సుమారు 2 లక్షల ఎకరాలకు పైగానే వరి సాగు కానున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తవడంతో అన్నదాతలు యాసంగి వరి సాగుపై దృష్టి సారించారు. నారుమళ్లు సిద్ధం చేసుకోవడంతో పాటు దుక్కులు దున్నుతున్నారు. బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, నస్రూల్లాబాద్‌, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో ఇప్పటికే సుమారు 800 ఎకరాలకు పైగా వరి నాట్లు వేశారు. వ్యవసాయాధికారులు నచ్చచెబుతున్నా రైతులు వరిని వదిలేది లేదంటున్నారు.