ఫ్రీడమ్ కప్ ర్యాలీలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
మేడ్చల్ (జనంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని మహాత్మాగాంధీ ఉద్యమానికి స్ఫూర్తినింపిన ప్రధాత అని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.
శనివారం కీసర కలెక్టరేట్ ఆవరణలో జిల్లా అధికారులు, సిబ్బంది, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ఫ్రీడమ్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్ధిదారులు ప్రత్యేక ప్రదర్శనగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఎంతో ప్రాధాన్యతనిస్తూ ప్రతినిత్యం కార్యక్రమాలు నిర్వహించేలా చేశారన్నారు. ఈ మేరకు ఈనెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వజ్రోత్సవాల్లో ప్రతిరోజూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇది ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని గుర్తించి ముందుకు సాగాలని వారు చూపిన బాటలో పయనించాలని కలెక్టర్ కోరారు. స్వాతంత్ర్య ఉద్యమానికి మహాత్మాగాంధీ ఎంతో గొప్ప పోరాటం చేసి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపారని అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు తప్పకుండా గాంధీ చిత్రాన్ని వీక్షించాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. గాంధీ చూపిన మార్గంలో పయనించాలని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ధైర్యంగా ముందుకు నడవాలని ఏమాత్రం అధైర్యంగా ఉండరాదని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. అనంతరం ఫ్రీడమ్ ర్యాలీలో బెలూన్లను వదిలారు. విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ , స్కౌట్స్ అండ్ గైడ్స్ తో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ. లో వందేమాతరం, భారత్ మాతాకీ జై, సారే జహాసే అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే నినాదాలతో మార్మోగింది. ఈ నెల 8 నుండి ఈరోజు వరకు నిర్వహించిన ఉత్సవాలను దిగ్విజయం చేసినందులకు ఉద్యోగులకు ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో వజ్రోత్సవ వేడుకల సంబరాలను విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్, జడ్పీ సీఈవో దేవసహాయం ,కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, వినోద్, డీఈవో విజయకుమారి, డీఐఈవో కిషన్, డీఐఎస్వో బల్రామ్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
