బంగారు తెలంగాణ కెసిఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్
ధర్మపురి,మే2( జనం సాక్షి): బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే సీఎం కేసీఆర్ ధ్యేయమని, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్‌ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే,చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్‌ఎస్ లోకి రావాలనుకున్న వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు మెచ్చి ఇతర పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, గ్రామాల అభివృద్ధి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సాధ్యమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అభివృద్ధే ఎజెండాగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నామన్నారు. అన్నదాతను ఆదుకునేందుకే సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని ఎమెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, దేశంలోని ఇతర రాష్టాల్రు సైతం మన పథకాల గురించి తెలుసుకోవటానికి ఆసక్తిని కనబర్చుతున్నాయని అన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం ఎకరానికి రూ.4వేలు, రెండు పంటలకు రూ.8వేలు ఇస్తున్న ప్రభుత్వం మనదేనన్నారు. ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందుతుందని అన్నారు. త్వరలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పారు విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటేనన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.