బదిలీల్లో అవకతవకలపై భగ్గుమన్న ఉపాధ్యాయులు..
ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ముట్టడి
రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి)
ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. శనివారం ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీగా జిల్లా విద్యాధికారి కార్యాలయానికి తరలివచ్చారు. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రమాణాలు పాటించకుండా పైరవీలకే పెద్దపీఠ వేశారని ఆరోపిస్తూ కార్యాలయం ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాల పాటు కాలయాపన చేసిన ప్రభుత్వం బదిలీల్లో పైరవీలకే ప్రాధాన్యత ఇస్తూ అనేక అవకతవకలకు కారణమైందని ఆరోపించారు. సచివాలయం సాక్షిగా సుమారు వంద మందిని బదిలీ చేశారని మండిపడ్డారు. అవకతవకలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గతంలో జరిగిన బదిలీల లాగే పారదర్శకంగా నిర్వహించాలని ఇప్పటివరకు జరిగిన బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు రాజేశ్వర్‌రావు, పాకాల శంకర్‌గౌడ్, మల్లారపు పురుషోత్తం, గనాది శ్రీనివాస్, ఉత్తమ్ విజయకుమారి, కందుకూరి దయానంద్, భీమన్నగారి నారాయణ, వెంకటేశ్వర్లు, వేణుమాధవ్‌లు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.