‘బాబు’గారికి బీసీలు గుర్తొచ్చారోచ్‌

తొమ్మిదేళ్లు పాలించినప్పుడు గానీ, ఆ తర్వాత ఐదేళ్లు ఖాళీగా ఉన్నప్పుడు గానీ, ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలప్పుడు గానీ, ఆ తర్వాత గడిచిన ఈ మూడేళ్లలో గానీ తెలుగుదేశం పార్టీ అధిపార్టీ అధినేతకు బీసీలు గుర్తుకు రాలేదు. ఇంత కాలానికి ‘బాబు’గారికి ఆ బలహీన వర్గాలపై ప్రేమ పుట్టుకొచ్చింది. అదెందుకో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రెండేళ్లలో వస్తున్నాయి కదా సార్వత్రిక ఎన్నికలు. అందుకే నారా వారికి బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చింది. గతం గుర్తుకొచ్చింది. ఎనిమిదేళ్లు ఇంటికే పరిమితం చేసిన బీసీల ‘ఓటు’వాటం ఎలా ఉంటుందో టీడీపీ అధినేతకు బాగా తెలిసొచ్చింది. అందుకే, 2014లోనైనా బీసీల కృపకు పాత్రుడు కాకుంటే, గద్దెనెక్కే అవకాశం లేదని భావించినట్లున్నాడు. మమ్మల్ని గెలిపిస్తే ‘అవి ఇస్తాం.. ఇది చేస్తాం’ అంటూ హామీల జల్లు కురిపించి బీసీలను ఆకట్టుకునేందుకు ఎత్తులు వేస్తున్నాడు. బాబుగారి హామీలు ఎలా ఉన్నాయంటే.. రానున్న ఎన్నికల్లో 100 సీట్లు బీసీలకు ఇస్తారట ! బీసీలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కేంద్రంతో కొట్లాడుతా ! బీసీల అభివృద్ధికి 10 వేల కోట్లతో అభివృద్ధి పథకాలు రూపొందిస్తాడట ! స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 50 రిజర్వేషన్‌ కల్పిస్తాడట ! సూపరున్నయ్‌ టీడీపీ అధినేత హామీలు. మరి ఈ ప్రశ్నలకు కూడా జవాబులు ఇవ్వాలి. 30 ఏళ్ల టీడీపీ చరిత్రలో బీసీలకు 100 సీట్లు ఇవ్వాలని ఆ పార్టీకి ఎందుకు గుర్తుకు రాలేదు ? ఆ పార్టీ రాష్ట్రంలో హయాంలో ఉన్నప్పుడు, ఆ పార్టీ మద్దతుతో ఎన్డీఏ కేంద్రంలో పాలన సాగిస్తున్నప్పుడు బీసీలకు చట్టసభల్లో 33 శాతం కల్పించాలని అనిపించలేదా ? 10 వేల కోట్ల ప్యాకేజీ విషయానికి వస్తే అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తారు ? ప్రభుత్వ ఖజానా దివాళా పరిస్థితుల్లో ఉందని బాబే విమర్శిస్తున్నాడు కదా ! ఇదంతా సరే బీసీలు కేవలం వీటితో తృప్తి పడాలా ? టీడీపీ రాష్ట్రాన్ని పాలించిన కాలంలో మామాఅల్లుళ్లే సీఎంలయ్యారు ? పార్టీలోని బీసీలకో లేక వేరే ఏ ఇతర సామాజికవర్గానికి చెందినవారికో సీఎం అయ్యే అర్హత లేకపోయిందా ? ఉంటే ఈ ఇద్దరే ఎందుకు పాలించారు. బడుగు బలహీన కార్మిక వర్గాల శ్రేయస్సు కోసం టీడీపీ ఆవిర్భావం జరిగిందని నాటి సీనియర్ల నుంచి నేటి జూనియర్ల వరకు ఆ పార్టీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు చెప్పుకుంటారే, మరి బీసీలకు రెండో స్థానం తప్ప మొదటి స్థానం ఇవ్వాలన్నా ఆలోచన ఆ పార్టీ అధిష్టానానికి ఎందుకు రాలేదు ? ఆ పార్టీ సిద్ధాంతాల్లో ఇది లేదా ? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పాల్సింది నారా వారే. ఈ ప్రశ్నలన్నీ అబద్ధమని టీడీపీ అధినేత కొట్టి పారేస్తే, బేషరతుగా రానున్న ఎన్నికల్లో బీసీలకు సీఎం పదవి అప్పగిస్తామని ప్రకటించాలి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే సత్తా టీడీపీ రథసారథిలో ఉందా ? ఉంటే, ఉందని బాబు నిరూపిస్తే అప్పుడు బీసీలు ఓటు వేయాలో వద్దో నిర్ణయించుకుంటారు.