బాబూ! జనం నిన్ను తరిమి కొడతారు
– కరువు జిల్లాకు సాగునీరు వద్దంటావా
– టీడీపీ అడ్డుపుల్లపై హరీష్ ఫైర్
హైదారబాద్,జులై 9 (జనంసాక్షి):
పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవడం ద్వారా హైదారబాద్ జంటనగరాలకు నీరు రాకుండా చేయాలని చూస్తున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఇక్కడి ప్రజల ఆగ్రహానికి గురయ్యేలా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నాడని అన్నారు. ఆయన తెలంగాన ద్రోహి అనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదన్నారు. తెలంగాణకు ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు ద్రోహి అని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని అంటూ, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డుకోవడం కోసం చంద్రబాబునాయుడు కేంద్ర జలవనరుల సంఘానికి లేఖ రాయడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో వలసలతో పాలమూరు జిల్లా అలమటిస్తోంది. ఏ రకంగా చూసినా ఈ దేశంలో మొట్టమొదటగా కట్టాల్సిన ప్రాజెక్టు… పాలమూరు ప్రాజెక్టని అన్నారు. 9 ఏళ్లు దత్తత తీసుకుని పాలమూరు జిల్లాలకు చంద్రబాబు చేసిందేమి లేకపోగా చంద్రబాబుది ఏనాడైనా ద్రోహబుద్దేనని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో కలిసి ఉన్న పాపానికి అందరికంటే ఎక్కవ మోసపోయింది పాలమూరు జిల్లానే అన్నారు. తెలంగాణ ఓట్లు కావాలి కాబట్టి ఆనాడు జీవో. నెం. 72 ఇచ్చిన నాడు చంద్రబాబు వ్యతిరేకించలేదని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు జి.ఓ ఉమ్మడి ఎపిలోనే ఇచ్చారని, దానిని చంద్రబాబు ఎలా వ్యతిరేకిస్తారని అన్నారు. గురువారం నాడిక్కడ ఆయన విూడియాతో మాట్లాడుతూ గతంలో దత్తత తీసుకున్నామని చెప్పి , అక్కడ ఏవిూ చేయకుండా ద్రోహం చేశారని, ఇప్పుడు మేము ఎలాగైనా నీరు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇప్పుడు దగా,మోసానికి పాల్పడుతూ పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని హరీష్ రావు అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా ప్రాజెక్టులను కట్టి తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామని అన్నారు. భూసేకరణకు కమిటీ కూడా వేస్తామని అన్నారు. విూరు ఏ అనుమతి ఇవ్వకుండా పట్టిసీమ కడితే ముందు తాము ఫిర్యాదు చేయలేదని ఆయన అన్నారు. చంద్రబాబు అసలు మనిషేనా, మానవత్వం ఉందా,చంద్రబాబు ఇంత మరుగుజ్జు మనస్తత్వం,పాపిష్టి గుణం మరొకరికి ఉండదన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు నీరు రానివ్వకుండా అడ్డుకుంటే ఊరుకునేది లేదని హరీష్ రావు అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జీవో జారీ చేశారని హరీశ్‌రావు తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని మంత్రి తెలిపారు. ఒక్క పంట కోసం తాము ప్రాజెక్టును నిర్మిస్తుంటే దానికి కూడా ఆంధ్రా ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేని పట్టిసీమ ప్రాజెక్టును తమకంటే ముందే ఏపీ ప్రభుత్వం ప్రారంభించిందని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకం మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల కోసం మాత్రమే కాదని.. హైదరాబాద్ నగర ప్రజలదాహార్తిని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ నగరం కృష్ణా బేసిన్‌లో ఉందని.. అందువల్ల కృష్ణా నీటిని వాడుకునేందుకు నగరానికి పూర్తి హక్కు ఉందన్నారు. తాము ఇరు రాష్ట్రాల రైతులు బాగుండాలని కోరుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం తెలంగాణ రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. హుద్‌హుద్ తుపాను సమయంలో మానవతా దృక్పథంతో తాము ఏపీకి సహాయం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మాట్లాడితే తెలుగుజాతి, రెండు కళ్ల సిద్ధాంతం అంటూ, విూరు హైదరాబాద్‌లో ఉంటూనే ఇక్కడ నీటి సరఫరాను అడ్డుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏ కృష్ణా బేసిన్‌లో ఉంది. హిమాయత్‌సాగర్, గండిపేటకు పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసుకువస్తుంటే అడ్డుకుంటున్నాడు. హైదరాబాద్‌లో ఉండే ప్రజలకు తాగునీరివ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రాప్రజలే చంద్రబాబును రాళ్లతో తరిమికొడ్తారు. చంద్రబాబు తీరు వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్టుందన్నారు. చంద్రబాబుకు వలసకూలీల ఉసురు తాకుతుంది. ప్రపంచంలో ఎవరైనా తానున్న ప్రదేశానికి నీళ్లు రావొద్దని అనుకుంటాడా. అలాంటోడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. నోటితో నవ్వి… నొసటితో వెక్కిరించడంలో చంద్రబాబుకు నోబెల్ ఇవ్వవచ్చన్నారు. వచ్చే నెలలోనే టెండర్లు పిలుస్తం. భూసేకరణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేస్తాం. పాలమూరు ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. . చంద్రబాబు ఫిర్యాదుపై కేందప్రభుత్వం మమ్మల్ని వివరణ అడిగిందని, చంద్రబాబు కుతంత్రాలను తిప్పికొట్టేలా కేంద్రానికి వివరణ పంపిస్తామని అన్నారు. కృష్ణాలో. తెలంగాణ వాటా అయిన 299 టీఎంసీల నీళ్లను ఎలాగైనా ఎక్కడైనా తెలంగాణ వాడుకోవచ్చని కృష్ణాబోర్డు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.