‘బార్లు’ తీరిన జనం..!
విజయనగరం, జూన్ 12 : ప్రతిరోజు విజయనగరం పట్టణంలో దాదాపు 30 లక్షల రూపాయలకు పైగా విక్రయాలు జరిగే మందుకు కరువు వచ్చింది.పట్టణంలో 16 షాపులలో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. ఇటు ఎక్సైజ్, అటు ఎసిబి అధికారుల చర్యలు కారణంగా కీలక నిందితులు జైలులో ఉన్నారు. సిండికేట్ ద్వారా జరగాల్సిన మద్యం వ్యాపారం గత ఆరు నెలలుగా వచ్చిన లాభాల పంపకం జరగక పోవడంతో వ్యాపారుల్లో అసంతృప్తి నెలకొంది. దీనికి తోడు సిండికేట్లలో బినామీ వ్యవహారాలు పూర్తిగా ఉన్నందున అసలైన షాపు వేలంపాట దారునికై మద్యం సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించడంతో అసలు వ్యక్తులు ఎవరూ రావడం లేదు. ఫలితంగా పట్టణంలోని షాపులలో మద్యం నిల్వలు నిండుకున్నాయి. మరోవైపు కేవలం బార్లలో మాత్రమే మద్యం విక్రయాలు సాగుతున్నందున అక్కడ ఉదయం నుంచి జనం క్యూ కడుతున్నారు. వీరికి మద్యాన్ని అందించలేక బార్లలో సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా మంగళవారం నుంచి మద్యాన్ని బయటకు విక్రయించరాదని నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి కొత్త మద్యం విధానం అమలులోకి వస్తుందని చెబుతున్నప్పటికీ ఇంతవరకు విధి విధానాలు నిర్ణయించనందున పరిస్థితి గందరగోళంగా ఉంది. ప్రస్తుతం మద్యం దొరకక ఈ ప్రాంతీయులు ఇతర ప్రాంతాలకు పరుగులెత్తే పరిస్థితి ఎదురైంది.