బావిలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

పెద్దపల్లి,జూన్‌23(జ‌నం సాక్షి): వ్యవసాయ బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం పరిధిలోని కుర్మపల్లిలో చోటుచేసుకుంది. శుక్రవారం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలురు గ్రామ శివారులోని బావిలో శవాలై కనిపించారు. ఇద్దరు బాలుర మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతులను బండి అరవింద్‌(13), గుర్రం ప్రణీత్‌(10)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలురు శవాలై కనిపించడంతో మృతుల కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.