బావిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల,జూన్‌19(జ‌నం సాక్షి ): మనస్థాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషద సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అపర్ణ(19) అనే విద్యార్థిని ఇటీవల వెలువడిన నీట్‌ ఫలితాల్లో ర్యాంక్‌ సాధించలేకపోయింది. కాగా డిగ్రీ చదువనని చెబుతూ ఈ ఏడాది కూడా లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌లో చేరిపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరింది. నిరాకరించిన తల్లిదండ్రులు విద్యార్థిని డిగ్రీలో జాయిన్‌ చేపించి హాస్టల్‌లో ఉంచారు. సెలవుపై ఇంటికి వచ్చిన అపర్ణ మనస్థాపానికి గురై వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బావిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యువతి చనిపోయినట్లుగా వైద్యులు నిర్దారించారు.