బీజింగ్‌లో సీఎం కేసీఆర్‌ బిజీబిజీ

C

వాండా కంపెనీ ప్రతినిధులతో సమావేశం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌11(జనంసాక్షి): చైనాలో పర్యటిస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రిం బీజింగ్‌ చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన చైనా రాజధాని బీజింగ్‌లో వాండా కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ వాండా కంపెనీ సీనియర్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు వాండా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ అంగీకరించింది. దేశంలోనే అత్యంత అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా రూపొందుతోందని సీఎం వాండా కంపెనీ ప్రతినిధులకు వివరించారు. సీఎంతోపాటు రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతినిధి బృందం కూడా ఉంది. హైదరాబాద్‌ను స్లమ్‌ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి సుమారు రెండు లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ వాండా ప్రతినిధులకు వివరించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. త్వరలో హైదరాబాద్‌లో తమ ప్రతినిధుల బృందం సందర్శించి భాగస్వామ్య మయ్యే అంశాలను పరిశీలిస్తుందని వాండా ప్రతినిధులు తెలిపారు. చైనా పర్యటనకు వెళ్లిన బృందం షాంఘై మున్సిపల్‌ కార్పొరేషన్‌ను సందర్శించింది. రాష్ట్ర మున్సిపల్‌ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ శాలినీ మిశ్రా, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. షాంఘై నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, పార్కులు, ప్లే గ్రౌండ్ల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఆధునిక యంత్రాల వినియోగం తదితర అంశాలను బృందం పరిశీలించింది. ప్రజలకందించే పౌర సదుపాయాలు, ప్రజల భాగస్వామ్యం, ఆదాయ, వ్యయాలు తదితర అంశాలను పరిశీలించింది. సీఎం చైనాపర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం ఆయన చైనా రాజదాని బీజింగ్‌కు చేరుకున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా ఈ బృందంలో ఉన్నారు. కాగా, తన చైనా పర్యటనలో భాగంగా సీఎం టీఎస్‌ఐపాస్‌ గురించి చైనా పెట్టుబడి దారులకు వివరిస్తున్నారు. పెట్టుబడులతో హైదరాబాద్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.