బీజేపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి
` విద్యార్థులంతా అభివృద్ధి పనుల దగ్గర సెల్ఫీలు దిగి ప్రచారం చేయాలి
` యువతకు కేటీఆర్ పిలుపు
` కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు
` డీకే .. అది మీ చేతకానితనానికి నిదర్శనం
` మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు
` మీ రైతులే ఇక్కడి వచ్చి వివరిస్తున్నారు
` సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి: మంత్రి
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై సోషల్ విూడియా ద్వారా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ ఫేక్ ప్రచారాన్ని సోషల్ విూడియా ద్వారానే తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు.2014కు ముందు తెలంగాణ ఎట్లున్నదో, ఇప్పుడెట్లున్నదో ఆలోచించాలని ప్రజలు ఆలోచించాలని మంత్రి కోరారు. గత తొమ్మదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిపై ఊరూరా చర్చ చేపట్టాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. ఫేక్ న్యూస్‌తో బీజేపీ సోషల్ విూడియాలో ఊదరగొడుతోందని మండిపడ్డారు. సోషల్ విూడియా ద్వారానే బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.విద్యార్థులంతా అభివృద్ధి పనుల దగ్గర సెల్ఫీలు దిగి ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. 33 మెడికల్ కాలేజీల దగ్గర సెల్ఫీలు దిగి డీపీలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో 1,001 గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. గురుకుల విద్యార్థులతో రీల్స్ చేసి ఇన్‌స్టాలో పెట్టాలని సూచించారు. ప్రతి ఇంటి దగ్గర నల్లా పక్కన నిలబడి సెల్ఫీలు పెట్టాలన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నర్సీరీ ఉన్న ఏకైక రాష్ట్రం మనదని మంత్రి చెప్పారు. జిల్లాల్లోని ఐటీ టవర్ల దగ్గర నిలబడి ఫొటోలు దిగి ప్రచారం చేయాలని కోరారు.
కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లో ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అభ్యర్ధేనని విమర్శించారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందో ప్రజలకు తెలుసన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్‌ఎస్ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు అని విమర్శించారు. ఆ పార్టీకి ఓటేసి తప్పు చేశామని కర్ణాటక రైతులు బాధపడుతున్నారని చెప్పారు. కన్నడ రైతులు మన రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్ పాపాలను చెబుతున్నారని వెల్లడిరచారు. కరెంటు ఇవ్వనందుకు నిరసనగా రైతులు మొసళ్లు తెచ్చి సబ్‌స్టేషన్లలో వదులుతున్నారని తెలిపారు.కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ చెప్పారని, మన రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంటు ఉస్తున్నామని వెల్లడిరచారు. డీకే మాటలు విని మన రైతులు ముక్కున వేలేసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కర్ణాటకలో రియల్ ఎస్టేట్ రంగం ఆగమాగం అయిందన్నారు. బెంగళూరులో చదరపు అడుగుకు రూ.500 ఎక్కువ వసూలు చేస్తున్నారని విమర్శించారు. అదే తెలంగాణలో టీఎస్ బీపాస్‌తో లంచాలు లేకుండా భవన నిర్మాణ అనుమతులు వస్తున్నాయని చెప్పారు.హైదరాబాద్ అభివృద్ధిని చూసి సినీ నటులు రజనీకాంత్, సన్ని డియోల్ ఆశ్చర్యపోయారని చెప్పారు. నగరం నలువైపులా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గడ్డి అన్నారంలో వెయ్యి పడకల టిమ్స్ సిద్ధమవుతున్నదని, నిమ్స్‌లో మరో రెండువేల బెడ్స్‌తో కొత్త బ్లాక్ నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతానికి ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. మలక్‌పేట ఐటీ టవర్ పూర్తయితే 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.ఎల్బీనగర్ 2014కు ముందు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందని కార్యకర్తలను అడిగారు. ఎల్బీనగర్ ఎంత అభివృద్ధి చెందిందో ఇంటింటికి తిరిగి ప్రజలకు గుర్తుచేయాలని సూచించారు. గతంలో ట్రాఫిక్ అవస్థలు, మంచినీటి సమస్యలు, మురుగునీటి వాసన ఉండేవని, ఇప్పుడు అలాంటివేవీ ఇక్కడ లేవన్నారు. మెట్రో రైలును పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ వరకు, ఎల్బీనగర్ విూదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విస్తరిస్తామని చెప్పారు. పనామా చౌరస్తాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని గుర్తుచేశారు.కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కికి ఎల్బీనగర్ గురించి ఏం తెలుసన్నారు. కాంగ్రెస్ వాళ్లు సీట్లు పంచుకునే సరికి మనం స్వీట్లు పంచుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హావిూ నెరవేర్చకుంటే రాజీనామా చేస్తానన్న నాయకుడు సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్‌లో బీజేపీ కార్పొరేటర్లను గెలిపిస్తే పైసా పని చేయలేదని విమర్శించారు. బూత్‌స్థాయి కార్యకర్తలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి చెప్పాలని సూచించారు. ఎల్బీనగర్ ఎంత అభివృద్ధి చెందిందో గుర్తుచేయాలన్నారు. సీఎం కేసీఆర్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలన్నారు. అన్నపూర్ణ పథకం ద్వారా రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తామని, కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా అన్నారు. రూ.400లకే వంటగ్యాస్ సిలిండర్ వంటి పథకాలను గురించి వివరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
డీకే.. అది విూ చేతకానితనానికి నిదర్శనం: మంత్రి కేటీఆర్
కర్ణాటకకు వస్తే తాము చేసిన అభివృద్ధి చూపిస్తామన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. విూ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. విూ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే ఇక్కడికి వచ్చి విూరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారని, తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందని చెప్పారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా అని ప్రశ్నించారు.‘డీకే గారు.. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది విూ చేతకానితనానికి నిదర్శనం. విూ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. విూ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి విూరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు.ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా..?. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హావిూలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఎన్నికల ప్రచారంలో ఐదు హావిూలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. విూ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. చార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది. కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్‌లతో వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నయి.విూ అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన విూ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు. రేషన్‌పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని విూ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసిని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారింది.సబ్ స్టేషన్ల వద్ద మొసళ్లతో నిరసనలు.. కరెంట్ కోసం పురుగుల మందు తాగి రైతుల ఆత్మహత్య ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ ఘోర పరిపాలనా వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్న విూ గృహలక్ష్మి హావిూకి కూడా గ్రహణం పట్టింది. ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానన్న ప్రధాని హావిూలాగే విూ హావిూ కూడా గంగలో కలిసిపోయింది. కర్ణాటకలో అధికారంలోకి రాగానే కవిూషన్ల కుంభమేళాకు తెర తీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోంది. కర్ణాటకలో సకల రంగాల్లో సంక్షోభానికి తెరతీసిన కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవడానికి మా ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డ.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.