బీపీఎల్‌కు పాక్‌ ఆటగాళ్లు దూరం పరోక్షంగా ప్రకటించిన పిసిబీ చీఫ్‌ అష్రాఫ్‌

లా¬ర్‌, జనవరి 1: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య క్రికెట్‌ సంబంధాల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. తమ దేశంలో పర్యటించేందుకు ముందు ఒప్పుకుని తర్వాత వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుపై పాక్‌ క్రికెట్‌ బోర్డు ఆగ్రహంతో ఉంది. వారు గతంలో ఇలాగే వ్యవహరించడంతో పిసిబీ ఛైర్మన్‌ జాకా అష్రాఫ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌కు తమ ఆటగాళ్ళను పంపించకూడదని పిసిబీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా… అష్రాఫ్‌ మాట తీరులో మాత్రం బీసిబీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ ఆటగాళ్ళ షెడ్యూల్‌ , వేరే వ్యవహారాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే బిపిఎల్‌కు రిలీజ్‌ చేస్తామని అష్రాఫ్‌ చెప్పారు. దీంతో కొత్త సంవత్సరంలో జరగనున్న బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాక్‌ ప్లేయర్స్‌ ఆడే అవకాశం దాదాపు లేనట్టే. ఇదిలా ఉంటే భద్రతా కారణాల రీత్యా వరుసగా రెండోసారి కూడా పాక్‌ పర్యటనను వాయిదా వేసుకున్న బీసిబీపై పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ ఆచితూచి స్పందించింది. వారి నిర్ణయం ఎలా ఉన్నప్పటకీ… తాము ఒత్తిడి చేయదలుచుకోలేదని స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు వారు విలువ ఇవ్వని పక్షంలో తాము కూడా అదే విధంగా వ్యవహరించడంలో తప్పు లేదని అష్రాఫ్‌ వ్యాఖ్యానించారు. గతంలో పర్యటించేందుకు అంగీకరించిన బంగ్లా క్రికెట్‌ బోర్డు తాజాగా వెనకడుగు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇటీవల పాకిస్థాన్‌లో రెండు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు జరిగినప్పుడు భద్రతపై ఎటువంటి ఇబ్బందులూ తలెత్తలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటకీ బీసిబీ సెక్యూరిటీ కారణాన్నే చూపడం సరికాదని చెప్పారు.