బీహార్‌కు 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ
– మోదీ ఎన్నికల వరం
పాట్నా,ఆగస్ట్ 18 (జనంసాక్షి):
ఓ వైపు ఎపికి ప్రత్యేక హెదా, ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్న తరుణంలో దానిపై మాట్లాడని ప్రధాని మోడీ, బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ ఆర్థిక ప్యాకేజి ప్రకటించారు. బిహార్‌కు రూ.1.25లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. బిహార్ అభివృద్ధికి అదనంగా మరో రూ.40వేల కోట్లు ఖర్చు పెడతామని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహారుకు ప్రధాని నరేంద్ర మోడీ లక్ష ఇరవై ఐదువేల కోట్ల ప్యాకేజీని, మరో నలభై ఐదు వేల కోట్ల ఆర్దిక సాయాన్ని ప్రకటించడంతో బీహార్‌లో హర్షాతిరేకం వ్యక్తం అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బిహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆరాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధిపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ రహదారి ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. బిహార్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, బిహార్ ముఖ చిత్రాన్ని మార్చేస్తామని ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి, రహదారుల నిర్మాణం వంటి పథకాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి దేశ భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. రైతుల సంక్షేమం జరగనిదే వ్యవసాయ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ రూ.60 వేల కోట్లు ఇస్తారా…రూ.70 వేల కోట్లు ఇస్తారా…రూ.90 వేల కోట్లు ఇస్తారా అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చేస్తున్నారని రూ.1.25 లక్షల కోట్లు ఇస్తామని మోదీ ప్రకటించడంతో అర్రాలో ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. పేదరికం నుంచి ధనిక రాష్ట్రంగా బీహార్‌ను అభివృద్ధి చేస్తానని ఆయన హావిూ ఇచ్చారు. బీహార్ భవిష్యత్తును తన ప్రభుత్వం మార్చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో త్వరలోనే బీహార్‌కు పట్టిన జబ్బు నయమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా పథకాలకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నానని వెల్లడించారు. బీహార్ అభివృద్ధి చెందితే ఎక్కువగా ఆనందించేది తానే అని ఆయన అన్నారు. దళితుల అభ్యుదయం కోసి కృషి చేసిన వ్యక్తిని బీహార్ గవర్నర్‌గా నియమించామని మోదీ తెలిపారు. బీహార్ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపన చేశారు. 11 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించారు. 25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే 23 స్కిల్ ట్రైనింగ్ సెంటర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడంతో మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు అయ్యింది. కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. మోదీ సభకు జనం భారీగా తరలివచ్చారు. గతంలో జమ్ము-కశ్మీర్ వంటి రాష్ట్రానికి కొంత అదికమొత్తాలలో ప్యాకేజీలు ఇచ్చినా,బీహారు కు తాజాగా ప్రకటించిన ప్యాకేజీ చాలా పెద్దదిగా భావించాలి. దీనితో బీహారు దశ తిరుగుతుందని ఆశిస్తున్నానని మోడీ అన్నారు. అయితే ఇది ఎన్నికల కోసం ప్రకటించిన ప్యాకేజీనా,లేక నిజంగానే కేంద్రం ఇంత మొత్తం ఇవ్వగలుగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. బీహారు ఎన్నికలలో బిజెపి గెలిస్తే ఈ మొత్తం తేవలసిన బాద్యత ఆ పార్టీ పై పడుతుంది. ఎన్నికల ముందు ప్రధాని వంటి వారే ఇలా ప్రకటనలు చేయడం వల్ల రాజకీయంగా దేశానికి మంచిదేనా అన్న చర్చ వస్తుంది. నిజంగానే ఇంత మొత్తం కేంద్రం ఇవ్వగలుగుతుందా?ఇస్తే ఎన్ని సంవత్సరాలలో ఇస్తుంది?ఇలాంటి ప్రశ్నలు ఎన్నో చర్చకు రానున్నాయి.