బీహార్‌లో ఆటవికపాలనకు అంతం
– బీహార్ ఎన్నికల ప్రచారంలో మోదీ
గయ,ఆగష్టు 9(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గయలో నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో మాట్లాడారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అందుకే ఈసారి ఎన్డీయే గెలవడం ఖాయమన్నారు. బీహార్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. బీహార్ లో ప్రస్తుతం ఆటవిక పాలన నడుస్తోందని నితీష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లాలూపై కూడా మోడీ తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆటవిక సర్కారుకు జైలు అనుభవం తోడైందని జేడీయూ, ఆర్జేడీ కూటమిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. న్నికల కోసం చేతులు కలిపిన లాలూ, నితీష్… ఎన్నికల అనంతరం విడిపోవటం ఖాయమన్నారు. వారి పాలనలో బీహార్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని ప్రధాని మోడీ సూచించారు. పార్టీల కూటమిని విషపూరితమైనదిగా అభివర్ణించారు. దృఢమైన బీహార్ నిర్మాణం, మార్పుతో కూడిన బీహార్ ను ఏర్పాటు చేయడమే ఇప్పుడు యువత ముందున్న కర్తవ్యాలన్నారు ప్రధాని మోడీ. బిహార్‌లో మార్పుకోసం ఉద్యమం పేరుతో భాజపా పరివర్తన యాత్రలు చేపట్టింది. ఆదివారం గయలో పరివర్తన యాత్ర పేరిట భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొన్నారు..మార్పు కావాలని బిహార్ ప్రజలు నిశ్చయించుకున్నారన్నారు. కేంద్రం బిహార్ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రంలో బిహార్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారన్నారు. బిహార్ ప్రజలు రెండు నిర్ణయాలు తీసుకోవాలి… ఒకటి దృఢమైన బిహార్ నిర్మాణం… రెండోది మార్పుతో కూడి బహార్ అని పేర్కొన్నారు. బిహార్‌ను అభివృద్ధి వైపు నడిపిస్తామని ప్రకటించారు.
మోదీ ప్రభుత్వాన్ని ట్విట్టర్ ప్రభుత్వంగా అభివర్ణించిన నితీష్
ఇదిలా వుండగా మోదీ పర్యటనపై సీఎం నితీశ్ కుమార్ తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. బీహర్ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనుండడంతో బీహర్‌పై మోదీ ప్రత్యేక ద?ష్టి పెట్టారు. అందులో భాగంగానే ఆయన ఆదివారం గయాలో పర్యటించారు. కేంద్రప్రభుత్వానికి నితీష్ ట్విట్టర్‌లో చురకలంటించారు. మోదీ ప్రభుత్వాన్ని ట్విట్టర్ ప్రభుత్వంగా నితీష్ కుమార్ అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా సమస్యలను వింటుంది, ఆ సమస్యలకు ట్విట్టర్ ద్వారా మాత్రమే స్పందిస్తుందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీహార్ నూతన గవర్నర్‌గా రాంనాథ్ కోవింద్ నియమించిన కేంద్రప్రభుత్వం కనీసం తమను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుని సంప్రదాయాలను మరచిందని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ నియామకంపై తమకు సమాచారం కూడా లేదని ఆయన అన్నారు. గవర్నర్‌కు బీజేపీ కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోందని, వారు ప్రతిదీ కులం అనే కోణంలోనే చూస్తారని ఆయన పేర్కొన్నారు. ఎవరు బీహార్‌కు గవర్నర్‌గా నియమితులైనా వారు బీహార్ గవర్నర్‌గా ఉంటారే తప్ప ఓ సామాజిక వర్గానికి గవర్నర్‌గా ఉండరు కదా అని నితీశ్ తెలిపారు.